శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై
సాక్షి బెంగళూరు: ప్రజలకు ఉత్తమ పాలన అందించాలని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బసవరాజబొమ్మై తొలిసారిగా శుక్రవారం ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలను కలుసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి సీఎంగా బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్, హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
అన్ని విధాల సహకారం అందిస్తాం...
ప్రధానితో భేటీ సందర్భంగా సీఎం బసవరాజ బొమ్మై కర్ణాటక రాష్ట్ర పరిస్థితులను వివరించారు. మోదీ స్పందిస్తూ ప్రజలకు మంచి పాలన అందించాలని, కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. ఇదే సమయంలో వరద నష్ట పరిహారం అందించాలని, హుబ్లీ–ధారవాడ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్, రాయచూరుకు ఎయిమ్స్ తరహాలో వైద్య సంస్థను మంజూరు చేయాలని ప్రధానికి సీఎం విన్నవించారు. కలబురిగి ఈఎస్‌ఐ వైద్య కళాశాల, స్థానిక ఆస్పత్రిని ఎయిమ్స్‌గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి.. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించి వారం రోజుల్లోగా మంత్రివర్గ విస్తరణ చేపడతానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment