డీజీపీలు, ఐజీపీల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా
లక్నో: పోలీసు శాఖకు క్షేత్రస్థాయిలోని అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భవిష్యత్తుల్లో రాబోయే పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఇందుకోసం కేంద్ర హోంశాఖ మంత్రి నేతృత్వంలో హైపవర్ పోలీసు టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఆదివారం డీజీపీలు, ఐజీపీల 56వ సదస్సులో ముగింపు కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పోలీసు సంబంధిత సంఘటనలు విశ్లేషించి, కేసు స్టడీలను అభివృద్ధి చేయాలని, వీటిని పోలీసులకు పాఠ్యాంశాలుగా మార్చాలని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో సాంకేతికత ప్రాముఖ్యత నానాటికీ పెరిగిపోతోందని ఉద్ఘాటించారు.
కోవిడ్–19 వ్యాక్సినేషన్ కోసం ‘కోవిన్’ పోర్టల్, గవర్నమెంట్ ఈ–మార్కెట్(జీఈఎం), ఆన్‌లైన్‌లో చెల్లింపుల కోసం యూపీఐ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. డీజీపీలు, ఐజీపీల సదస్సును హైబ్రిడ్(ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల వివిధ స్థాయిల్లోని అధికారుల మధ్య సమాచార మార్పిడి సులభతరం అవుతుందన్నారు.
‘స్మార్ట్’ పోలీసింగ్ విధానాన్ని సమీక్షించాలి
దేశవ్యాప్తంగా పోలీసు దళాలకు ఉపయోగపడే విధంగా ఇంటర్–ఆపరేబుల్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని నరేంద్ర మోదీ కోరారు. సామాన్య ప్రజల పట్ల పోలీసుల దృక్పథంలో సానుకూల మార్పు రావడం అభినందనీయమని అన్నారు. కోవిడ్–19 తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రజల అవసరాల కోసం డ్రోన్ టెక్నాలజీ వాడుకోవాలని వెల్లడించారు.
2014లో ప్రవేశపెట్టిన ‘స్మార్ట్’ పోలీసింగ్ విధానాన్ని సమీక్షించాలని అభిప్రాయపడ్డారు. పోలీసులను సాధారణంగా ఎదురయ్యే సవాళ్లకు ‘హ్యాకథాన్ల’ ద్వారా సాంకేతిక పరిష్కారాలు కనిపెట్టడానికి నిపుణులైన యువతను భాగస్వాములను చేయాలన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సిబ్బందికి ప్రధాని మోదీ ‘ప్రెసిడెంట్ పోలీసు మెడల్’ ప్రదానం చేశారు. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ఆయన విలువైన సూచనలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment