
ముంబై: ఎన్సీపీ అధినేత, మరాఠా యోధుడు శరద్ పవార్‌ను రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు చేస్తున్నారా..? భారత దేశపు అత్యున్నత పదవి కోసం పీకే లాబీయింగ్ ప్రారంభించారా..? గత కొద్ది రోజులుగా ఢిల్లీ పొలిటికల్ సర్కిల్‌లో ఈ వార్త చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో స్వయానా ఎన్సీపీ అధినేతనే ఈ విషయంపై స్పందించారు. తనను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టడానికి పీకే లాబీయింగ్ చేస్తున్నారన్న వార్తలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఇవన్నీ అసత్యపు ప్రచారాలని, అసలు అలాంటి ప్రస్తావనే లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రస్తావన ఉత్పన్నం కాదని కుండబద్దలు కొట్టారు. ఏ ప్రాతిపదికన తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు తేవాలని పీకే అనుకున్నారో తనకు తెలియదని, తమ భేటీ సందర్భంగా రాజకీయ అంశాలేవీ ప్రస్తావనకే రాలేదని వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల అంశం కూడా తమ మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేశారు. కాగా, గత నెలలో(జూన్) పీకే, శరద్ పవార్‌లు రెండుసార్లు భేటీ అయ్యారు. చివరిసారిగా వారు జూన్ 11న ముంబైలో సమావేశమయ్యారు. ఈ భేటీ మూడు గంటలకుపైగా కొనసాగింది. మరోవైపు పీకే నిన్న(జులై 13, మంగళవారం) కాంగ్రెస్ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీ, అతని సోదరి ప్రియాంక గాంధీలను ఢిల్లీలోని రాహుల్ నివాసంలో కలిశారు.