న్యూఢిల్లీ: భారత కొత్త రాష్ట్రపతిగా ఎన్డీఏ అభర్థి ద్రౌపది ముర్ము విజయ కేతనం ఎగురవేశారు. ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించారు. ద్రౌపది ముర్ముకు 2,161 ఓట్లు (68శాతం) రాగా, యశ్వంత్‌కు 1,058 ఓట్లు (31.1శాతం) పోలయ్యాయి. రాష్ట్రపతిగా గెలిచిన ఏన్డీఏ అభ్యర్థికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాహుల్ గాంధీ, యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 25న భారత 15వ రాష్ట్రపతిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ద్రౌపది ముర్ము ప్రస్థానం
నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి వరకు సాధించిన ఔన్నత్యం.. భారతదేశం నాగరికత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం పట్ల ఉన్న స్థిరమైన విశ్వాసానికి నిదర్శనంగా మారాయి. ద్రౌపది ముర్ము 1958, జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. భువనేశ్వర్‌లోని రమాదేవి ఉమెన్స్ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేశారు. స్కూల్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్ గా పనిచేశారు.
సంబంధిత వార్త: కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
రాజకీయ జీవితం
1997లో రాయ్‌రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికవడంతో ముర్ము రాజకీయ జీవింతం మొదలైంది. 2000లో రాయ్‌రంగాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రవాణా, వాణిజ్య, మత్స్య, పశుసంవర్ధక శాఖలు నిర్వహించారు. అంతకుముదు ఒడిశా బీజేపీ గిరిజన మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా చేశారు. 2010, 2013ల్లో మయూర్‌భంజ్‌జిల్లా బీజేపీ విభాగం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా చేశారు.
విషాదాలను దిగమింగుకొని
నేడు దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబోతున్న ద్రౌపది ముర్ము.. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, విషాదాలను ఎదుర్కొన్నారు. 2009లో పెద్ద కొడుకు అనుమానస్పద స్థితిలో మృతి చెందగా.. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో కొడుకు మరణించాడు. ఈ విషాదాల నుంచి తెరుకునేలోపే 2014లో భర్త శ్యామ్ చరణ్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.. కుటుంబంలోని ముగ్గురి మరణం ద్రౌపది ముర్ము జీవితంలో పెను విషాదాన్ని నిపింది.
ఇద్దరు కమారులు, భర్తను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయిన ఆమె.. కూతురు, తమ్ముడి అండతో మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. 2015లో జార్ఖండ్ గవర్నర్ అయ్యారు. రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ ద్రౌపది ముర్మునే. ఇప్పుడు దేశ అత్యుతన్నత రాజ్యాంగ పదవికి ఎన్నికై.. ఆ గౌరవం పొందిన తొలి ఒడిశావాసిగా, మొట్టమొదటి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment