
Presidential Candidate Draupadi Murmu: ‘మా అమ్మ అత్యంత సహనశీలి. కష్టం, విషాదంతో అన్ని తలుపులు మూతబడిన విపత్కర పరిస్థితుల్లో సడలని మానసిక స్థైర్యం కలిగిన సాహసి అమ్మ ద్రౌపది ముర్ము. ఒడిదుడుకులను సహనంతో ఎదురీది దేశంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఆమె నాకు సదా మార్గదర్శకం’. ఇదీ... ఎన్డీయే కూటమి తరఫున భారత రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్న ద్రౌపది ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము(35) తన తల్లిని ఉద్దేశించి, వెల్లడించిన అభిప్రాయం. ద్రౌపది ముర్ముకు 3 నెలల మనవరాలు ఉంది. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు ముందు ఆమె కుమార్తె, మనవరాలితో కలిసి, కొద్దిసేపు ముచ్చటించారు.
తొలుత ఫోన్ ద్వారా..
భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డీఏ తరఫున ద్రౌపది ముర్ము పేరు ఖరారైన విషయం తొలుత ఫోన్ ద్వారా తెలిసింది. ఆ సమయానికి గ్రామంలో కరెంట్ కోత ఉండడంతో టీవీ ప్రసారాన్ని చూడలేక పోయారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఈ శుభవార్తను తొలుత తెలియజేయడంతో ఆమె అవాక్కయ్యారు. 2017లో కూడా రాష్ట్రపతి అభ్యర్థిత్వం చివరి క్షణంలో చేజారిపోయింది. ఈసారి కలిసి వస్తుందని ఊహించలేక పోయారు. బరిలో నిలవడం నిజం కావడం ఆనందదాయకంగా పేర్కొన్నారు. ఉపాధ్యాయినిగా సాధికారతకు శ్రీకారం చుట్టి, తరచూ ప్రజాహిత, సామాజిక కార్యకలాపాల్లో పాలుపంచుకొని.. క్రమంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడారు.
చదవండి: చైల్డ్ ఆర్టిస్టులను ఇక అలా చూపించడానికి వీల్లేదు: కొత్త మార్గదర్శకాలు రెడీ!
కౌన్సిలర్ స్థాయి నుంచి అత్యున్నత రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిచే వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. బీజేపీ ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారు. బీజేపీ అభ్యర్థిగా వరుసగా 2సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 2000లో బీజేపీ–బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య రవాణా, మత్స్య, పశు సంవర్థక శాఖల మంత్రిగా బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. 2015లో ఝార్కండ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆమె పనితీరుపై కేంద్రం సంతృప్తికరంగా ఉండటంతో ఆరేళ్లకు పైగా 2021 వరకు అదే బాధ్యత్లో కొనసాగారు.
ప్రధాని తొలి సంతకం..
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జాతీయ గణతంత్ర కూటమి(ఎన్డీయే) ప్రముఖులు హాజరయ్యారు. తొలి ప్రతిపాదకులుగా ప్రధాని తొలి సంతకం చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఎన్డీయే ప్రముఖులతో ఎన్డీయేతర బీజేడీ, వైఎస్సార్ సీపీ ప్రముఖులు నామినేషన్ పత్రాల్లో సంతకాలు చేయడం విశేషం. ఒడిశాకు చెందిన బీజేపీ ఎమ్మల్యేలు ముర్ము నామినేషన్లపై సంతకాలు చేసిన వారిలో ఉన్నారు.
సైకత శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ద్రౌపది ముర్ముకు అంతర్జాతీయ సైకతశిల్పి, పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పూరీ సాగర తీరంలో తీర్చిదిద్దిన శైకత శిల్పం.. పలువురిని ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment