Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి | Presidential Election Results 2022: Draupadi Murmu Elected As A 15th President of India | Sakshi
Sakshi News home page

Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి

Published Fri, Jul 22 2022 2:56 AM | Last Updated on Fri, Jul 22 2022 8:05 AM

Presidential Election Results 2022: Draupadi Murmu Elected As A 15th President of India - Sakshi

ముర్ముకు శుభాకాంక్షలు చెబుతున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపదీ ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. సంతాల్‌ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. తద్వారా దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలను రెట్టింపు చేశారు. స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా కూడా నిలిచారు.

అధికార ఎన్డీఏ తరఫున బరిలో దిగిన ముర్ము గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజారిటీతో విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వారసురాలిగా 25వ తేదీ సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతిభా పాటిల్‌ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము.
 

దేశవ్యాప్తంగానే గాక ప్రపంచం నలుమూలల నుంచీ ముర్ముకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారని, దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలుపుతారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వెలిబుచ్చారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో కలిసి ముర్ము నివాసానికి వెళ్లి ఆమెను అభినందించారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు ప్రత్యర్థి సిన్హా ప్రకటించారు. ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతిగా తనదైన ముద్ర వేస్తారని ఆశాభావం వెలిబుచ్చారు.

ప్రతి రౌండూ ముర్ముదే
రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులైన ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు పార్లమెంట్‌ హౌస్‌తో పాటు దేశవ్యాప్తంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ హౌస్‌లోని 63వ నంబర్‌ గదిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. తొలుత పార్లమెంటు సభ్యుల ఓట్లు లెక్కించారు. అనంతరం అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు.

అంతా ఊహించినట్టుగానే కౌంటింగ్‌ ప్రారంభం నుంచే సిన్హాపై ముర్ము నిర్ణాయక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు. ప్రతి రౌండ్‌లోనూ దాదాపు మూడింట రెండొతుల ఓట్లతో దూసుకెళ్లారు. మూడో రౌండ్‌లోనే 50 శాతం ఓట్లు దాటేసి విజయానికి అవసరమైన మెజారిటీ మార్కు సాధించారు. అప్పటికి మరో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓట్ల లెక్కింపు మిగిలే ఉంది. చివరిదైన నాలుగో రౌండ్‌ కౌంటింగ్‌ ముగిశాక ముర్ము విజయాన్ని చీఫ్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌ పీసీ మోదీ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సర్టిఫికెట్‌ అందజేయనుంది.

► మొత్తం 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు కలిపి ఎలక్టోరల్‌ కాలేజీలో 4,809 మంది సభ్యులున్నారు. వీరిలో4,754 మంది ఓటేశారు. వారి మొత్తం ఓట్ల విలువ 10,72,377.
► వాటిలో ముర్ము 64.03 శాతం ఓట్లు సాధించగా సిన్హా 36 శాతంతో సరిపెట్టుకున్నారు. ముర్ముకు 6,76,803 పోలవగా సిన్హాకు 3,80,177 పడ్డాయి.
► 2,824 మంది ప్రజాప్రతినిధులు ముర్ముకు, 1,877 మంది సిన్హాకు ఓటేశారు.
► 15 మంది ఎంపీలతో పాటు మొత్తం 53 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి.
► ఎంపీల ఓట్లలో 540 (72.19 శాతం) ముర్ముకే పడ్డాయి. సిన్హాకు 208 మంది ఓటేశారు.
► గిరిజన బిడ్డ అయిన ముర్ముకు విపక్షాలకు చెందిన పలువురు గిరిజన, ఎస్సీ ప్రజాప్రతినిధులు కూడా జైకొట్టారు.
► 17 మంది ఎంపీలతో పాటు దాదాపు 125 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్టు తేలింది.
► అస్సాంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లో 20, మహారాష్ట్రలో 16, గుజరాత్‌లో 10, జార్ఖండ్‌లో 10, బిహార్‌లో 6,, ఛత్తీస్‌గఢ్‌లో 6, గోవాలో నలుగురు చొప్పున విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ చేశారు.
► ముర్ముకు యూపీ, మహారాష్ట్ర, ఏపీల నుంచి ఆమెకు అత్యధిక ఓట్లు వచ్చాయి. సిన్హాకు పశ్చిమబెంగాల్, తమిళనాడు నుంచి అత్యధిక ఓట్లు పడ్డాయి.
► ఆంధ్రప్రదేశ్, సిక్కింలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా, నాగాలాండ్‌లో మొత్తం ఎమ్మెల్యేలూ ముర్ముకే ఓటేయడం విశేషం!
► కేరళ నుంచి దాదాపుగా అన్ని ఓట్లూ సిన్హాకే పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement