ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ నాయకుడు అజిత్ పవార్‌కు ఆదాయపన్ను శాఖ గట్టి షాక్ ఇచ్చింది. పవార్, ఆయన కుమారుడు పార్థ్ పవార్, ఇతర బంధువులకు చెందిన రూ.1,400 కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసింది. ముంబై, న్యూఢిల్లీ, పుణె, గోవా, మరో డజనుకుపైగా ప్రాంతాల్లో ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్టుగా మంగళవారం ప్రకటించింది. ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాంజాక్షన్ యాక్ట్ 1988 కింద ఈ ఆస్తుల్ని అటాచ్ చేసుకున్నట్టుగా స్పష్టం చేసింది.
సతారాలో రూ.600 కోట్ల విలువ చేసే షుగర్ ఫ్యాక్టరీ, గోవాలో రూ.250 కోట్లు విలువ చేసే రిసార్ట్ నిలయ, దక్షిణ ముంబైలోని రూ.25 కోట్లు విలువ చేసే పార్థ్ పవార్ కార్యాలయం నిర్మల్ హౌస్ , దక్షిణ ఢిల్లీలోని రూ.20 కోట్లు విలువ చేసే ఫ్లాట్‌తో పాటుగా... వివిధ ప్రాంతాల్లో రూ.500 కోట్లు విలువ చేసే భూములు అటాచ్ చేసుకున్నట్టుగా ఐటీ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఆస్తులన్నీ అజిత్ పవార్, ఆయన బంధువులవేనని, వారి బినామీ పేర్ల మీద ఉన్నాయని తెలిపారు. ఆ ఆస్తులన్నీ అక్రమ మార్గాల్లోనే వారికి వచ్చాయని అన్నారు. గత నెలలో ఆదాయ పన్ను శాఖ అధికారులు పవార్ బంధువుల నివాసాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment