ఢిల్లీ: ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపర్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆమె జాడ తెలియరావడం లేదని ముంబై పోలీసులు చెప్తున్నారు. ముంబైతో పాటు ఢిల్లీ, కోల్‌కతా పోలీసులు సైతం ఆమె ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్ల తర్వాత ఢిల్లీ వాసి అయిన నూపుర్ శర్మకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమెకు గట్టి భద్రత కల్పించారు పోలీసులు. అయితే అదే సమయంలో.. పలు రాష్ట్రాల్లో ఆమెపైనా డజన్ల కొద్దీ కేసులు నమోదు అయ్యాయి. రజా అకాడమీ అనే ఇస్లాం సంస్థ కార్యదర్శి ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు సైతం నూపుర్‌పై కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఆమెను ప్రశ్నించేందుకు ముంబై పోలీసుల టీం ఒకటి.. ఢిల్లీకి వెళ్లింది. అయితే ఆమె ఎక్కడ ఉందనే సమాచారం మాత్రం ఇప్పటిదాకా వాళ్లకు తెలియలేదు. గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ముంబై పోలీసులు నూపుర్ కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ‘నూపుర్‌ను అరెస్ట్ చేయడానికి ముంబై పోలీసులకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. కోల్‌కతా పోలీసులు కూడా నూపుర్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. టీఎంసీ మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ సోహైల్ ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ఆమె స్టేట్‌మెంట్‌ను కోల్‌కతా పోలీసులు నమోదు చేయాల్సి ఉంది.
మరోవైపు ఢిల్లీ పోలీసులు సైతం ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈలోపే ఆమెకు బెదిరింపులు రావడంతో.. ఆమె కుటుంబానికి భద్రత కల్పించారు. అయితే ఆమె ఎక్కడ ఉందనే సమాచారం ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు సైతం తెలియదట!.
ఓ టీవీ డిబేట్‌లో జ్ఞానవాపి మసీదు అంశంపై మాట్లాడుతున్న కమ్రంలో.. ముహమ్మద్ ప్రవక్త వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేశారామె. ఆ వ్యాఖ్యలను ముస్లిం సంఘాలతో పాటు 15 ఇస్లాం దేశాలు ఖండించాయి. గల్ఫ్ దేశాలు సైతం అక్కడున్న భారతీయ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసి.. వివరణ, క్షమాపణలు కోరాయి.
అయితే వ్యాఖ్యల దుమారం మొదలైన వెంటనే నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఆమె వ్యాఖ్యలను సైతం ఖండించింది బీజేపీ. ఇక తన వ్యాఖ్యలపై భేషరతు క్షమాపణలు చెప్పిన నూపుర్ శర్మ.. పదే పదే మహాదేవుడ్ని(శివుడ్ని) అవమానించడం, అగౌరవపర్చడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment