ఛండీఘర్: పుట్టినరోజు నాడు కేక్ తినడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె పుట్టినరోజే చిన్నారికి చివరి రోజు కావడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. మార్చి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఓ బ్యాకరీ నుంచి ఆన్‌లైన్‌లో కేక్ ఆర్డర్ చేశారు. సాయంత్రం ఏడు గంటలకు కేక్ కట్ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. రాత్రి 10 గంటలకల్లా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఇక, గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి కల్లా ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో వైద్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో, సదరు బేకరీపై చిన్నారి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అనంతరం.. దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు, కేక్ నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం పంపారు. నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, పుట్టినరోజే తన బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment