
బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం
ఏకగ్రీవానికి సహకరించండి
విపక్షాలకు నడ్డా విజ్ఞప్తి
‘ఇండియా’ కూటమి అభ్యర్థి నేడు ఖరారు!
ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ (67) పేరు ఖరారైంది. ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంట్ బోర్డు భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కూటమి పక్షాలతో చర్చించి ఆయన పేరు ఖరారు చేసినట్టు వెల్లడించారు. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ విషయమై విపక్షాలతో గత వారమే చర్చించారు.
ఎన్డీయే అభ్యర్థి తేలాక మద్దతుపై నిర్ణయిస్తామని బదులిచ్చాయి. వాటి మద్దతు కూడగట్టడానికి చర్చలు కొనసాగుతాయి’’ అని స్పష్టం చేశారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యరి్థగా సి.పి.రాధాకృష్ణన్ పేరు ఖరారు కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఆయన సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని శనివారం ‘ఎక్స్’లో ప్రశంసించారు. అంకితభావం, మానవత్వం, ప్రతిభ కలిగిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. సామాజిక సేవపై ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేశారని తెలిపారు.
గెలుపు లాంఛనమే
ఉప రాష్ట్రపతి ఎన్నికలో విజయానికి అవసరమైన మెజార్టీ ఎన్డీయే కూటమికి ఉన్నందున రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే. 781 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. విజయానికి కనీసం 391 ఓట్లు అవసరం కాగా ఎన్డీఏకు 422 మంది ఎంపీల బలముంది. సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. విపక్ష ‘ఇండియా’ కూటమి ఉమ్మడి అభ్యర్థి తదితరులు బరిలో దిగితే ఎన్నిక అనివార్యమవుతుంది. పోటీపై నిర్ణయం తీసుకునేందుకు ‘ఇండియా’ కూటమి నేతలు సోమవారం భేటీ అవుతున్నారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఇటీవల అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది.
‘తమిళ’ ఎన్నికలే గురి!
తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి. స్టాలిన్ సారథ్యంలోని అధికార డీఎంకేను ఎలాగైనా ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎంపిక అందులో భాగంగానే కనిపిస్తోంది. ఆయన ఓబీసీ నేత కావడం, క్లీన్ ఇమేజీ ఉండటం ఎన్డీయేకు కలిసొచ్చే అంశం. పైగా అన్ని పార్టీలూ ఆయనను గౌరవిస్తుంటాయి. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో రాధాకృష్ణన్‌ది కీలకపాత్ర.
తమిళనాడు మోదీ!
సి.పి.రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జని్మంచారు. 16 ఏళ్లకే ఆరెస్సెస్‌లో చేరారు. బీజేపీ మాతృ సంస్థ జనసంఘ్‌తో ఆయనకు బలమైన అనుబంధముంది. అభిమానులు ఆయనను ‘తమిళనాడు మోదీ’ అని పిలుస్తుంటారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఆయన రెండుసార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీలో బలమైన ఓబీసీ నేతగా ఎదిగిన ఆయనకు పార్టీ పలుమార్లు గవర్నర్‌గా అవకాశమిచ్చింది.
జార్ఖండ్ గవర్నర్‌గా, తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సేవలందించారు. 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్నారు. రాధాకృష్ణన్ 1974లో జనసంఘ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడయ్యారు. తర్వాత తమిళనాడు బీజేపీ కార్యదర్శి అయ్యారు. పలు పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌గా, సభ్యుడిగా చేశారు. స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విచారణకు సారథ్యం వహించారు. 2004 నుంచి మూడేళ్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 93 రోజులపాటు 19,000 కిలోమీటర్ల మేర రథయాత్ర చేశారు.
- న్యూఢిల్లీ