జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీతో సంబంధాలున్నాయన్నారు. ఈ విషయంపై ఆ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'ఉదయ్‍పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలుసు. నిందితుడు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న విషయం ఇటీవలే తెలిసింది. అతను అద్దె కట్టడం లేదని ఆ ఇంటి యజమాని చెప్పారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ మొదలుపెట్టకముందే బీజేపీ కార్యకర్తలు నిందితుడు తమ వాడని పోలీసులకు చెప్పారు. పార్టీ కార్యకర్త అయినందున అతనికి ఎలాంటి ఇబ్బంది కల్గించవద్దన్నారు' అని గహ్లోత్ అన్నారు.
హత్య కేసు నిందితుడిపై పోలీసు కేసు నమోదు కాకుండా ఆపేందుకు కూడా బీజేపీ ప్రయత్నించిందని గహ్లోత్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తే అని పోలీసులకు చెప్పి అతనికి సాయం చేయాలని చూసిందని పేర్కొన్నారు. వీటిపై కమలం పార్టీ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన రియాజ్ అఖ్తారీ.. బీజేపీ నేతలతో దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ఇందులో రాజస్థాన్ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా కూడా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే కమలం పార్టీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తమపై వస్తున్న ఆరోపణలను బీజేపీ ఖండించింది.
కాగా, జూన్ 28న జరిగిన ఉదయ్‌పూర్ హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మరునాడే కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ తమ చేతుల్లోకి తీసుకుంది. ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
చదవండి: Goa: గోవాలో కాంగ్రెస్ ఖాళీ.. బీజేపీతో టచ్‌లో 11 మంది ఎమ్మెల్యేలు!
Comments
Please login to add a commentAdd a comment