జైపూర్: కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ ఉత్తమ మార్గమని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య కొన్ని రోజులు గ్యాప్ ఉండాలని కూడా పేర్కొంది. కోవాగ్జిన్ అయితే మూడు వారాలు.. కొవీషీల్డ్ అయితే 12-16 వారాల గ్యాప్ అవసరమని తెలిపింది. అయితే రాజస్తాన్‌లో ఒక మహిళ మాత్రం కరోనా వ్యాక్సిన్ రెండు డోసులను ఒకేసారి వేశారంటూ ఆరోపణలు చేసింది. దీంతో ఈ విషయం ఆసక్తికరంగా మారింది. మహిళ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన ఆసుపత్రి యాజమాన్యం ఆమెకు తొలి డోసు మాత్రమే వేశామని.. రూల్స్ ప్రకారం అలా సాధ్యం కాదని వివరణ ఇచ్చుకుంది. అయితే ఇందులో నిజమెంత అనేది ఇంకా క్లారిటీ లేదు.
విషయంలోకి వెళితే.. చరణ్ శర్మ దంపతులు కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఉదయం 9గంటలకు దౌసాలోని నానగల్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు వచ్చారు. కాగా 11 గంటలకు దంపతులిద్దరికి వ్యాక్సిన్ వేసి పంపించారు. చరణ్ శర్మ పనిమీద వేరేచోటికి వెళ్లగా.. అతని భార్య ఇంటికి వెళ్లింది. చరణ్‌శర్మ పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత భార్యకు కాస్త జ్వరంగా ఉండడంతో అనుమానం వచ్చింది. ఏమైంది అని భార్యను అడగ్గా.. నాకు వ్యాక్సిన్ రెండు డోసులు వేశారని.. అందుకే ఇలా జరుగుతుందని చెప్పడంతో చరణ్ శర్మ ఆశ్చర్యపోయాడు. వెంటనే వ్యాక్సిన్ వేసుకున్న పీహెచ్‌సీ సెంటర్‌కు వెళ్లి ఆరా తీయగా.. మీ భార్యకు ఒకటే డోస్ వేశామని.. రెండు డోస్‌లు ఒకేసారి ఇవ్వడం కుదరదని.. అందుకు రూల్స్ కూడా లేవని అతని మాటలను కొట్టిపారేశారు. అయితే చరణ్ శర్మ మరో వైద్యుడిని కలిసి విషయం చెప్పగా .. దానిని ఖండించి చరణ్ శర్మకు పారాసిటమల్ మందులు ఇచ్చి పంపించాడు.
కాగా ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో దౌసాచీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనీష్ చౌదరీ స్పందించారు. మహిళకు రెండు డోసులు ఇచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. తొలుత వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే రక్తం రావడంతో సిబ్బంది విరమించుకున్నారని, ఆ తర్వాత మరో ప్రాంతంలో టీకా వేశారని పేర్కొన్నారు. అయితే, సూదిని రెండుసార్లు పొడవడంతో తనకు రెండు డోసులు ఇచ్చినట్లుగా భావించి ఆమె భయపడుతోందని అన్నారు. అది నిజం కాదని డాక్టర్ మనీష్ చౌదరి స్పష్టం చేశారు. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు వైద్య బృందాన్ని ఆమె గ్రామానికి పంపామని తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు గుర్తించారని పేర్కొన్నారు. ఆమెలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదన్నారు.
అయితే ఇదే విషయంపై ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ్ శర్మ మాట్లాడుతూ.. ఏకకాలంలో రెండు డోసులు తీసుకున్నా దుష్ప్రభావాలేమీ ఉండవని తెలిపారు. ఫేజ్ 2 ట్రయల్స్‌లో దీనిని పరీక్షించామని, ఇప్పటివరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని పేర్కొన్నారు.
చదవండి: నిమ్స్‌లో వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు
Comments
Please login to add a commentAdd a comment