
భావోద్వేగ క్షణాలు.. కలెక్టర్ కన్నీటిపర్యంతం
గాంధీనగర్: కొందరు అధికారులు తమ సేవలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. తనకు కష్టం ఉన్నా.. తన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనే తాపత్రయంతో నిరంతరం శ్రమిస్తుంటారు. అటువంటి అధికారులు ఉంటే తమకు కూడా మంచే జరుగుతుందని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. ఒకవేళ ఆ అధికారి మరోచోటకు బదిలీ అయి వెళ్లిపోతుంటే తమ ఇంట్లో మనిషి వెళ్లిపోతున్నట్లే ఏడుస్తుంటారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం.
ప్రభుత్వ అధికారి అన్నప్పుడు బదిలీలు సాధారణం. తాజాగా ఒక జిల్లా కలెక్టర్ బదిలీ పేరిట మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో అక్కడి ప్రజలు, అధికారులు ఆమెకు ఘనమైన వీడ్కోలు ఇవ్వడం వైరల్‌గా మారింది. వివరాలు.. గుజరాత్ లోని రాజకోట్ జిల్లాకు రెమ్యా మోహన్ కలెక్టర్‌గా సేవలందిస్తున్నారు. తన పనితనంలో ఆమె అక్కడి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వారం కిందట రెమ్యా మోహన్‌నేషనల్ హెల్త్ మిషన్, డైరెక్టర్‌గా బదిలీపై వెళ్లారు.
ఈ సందర్భంగా ప్రజలు, ఉద్యోగులు భావోద్వేగంతో ఆమెకు చివరిసారిగా వీడ్కోలు పలికారు. పూలు జల్లుతూ.. రెడ్ కార్పెట్ వేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం పూల రథంతో వీడ్కోలు పలుకుతూ తమ గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడి సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించిన రెమ్యా మోహన్ కన్నీటిపర్యంతం అవుతూ అక్కడి నుంచి వెళ్లారు. కాగా కోవిడ్ -19 తో పాటు ఈ మధ్యన వచ్చిన తుఫాను సమయంలోను రెమ్యా నాయక్ నిరంతరం శ్రమించారు. ఎంత కష్టం ఎదురైనా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవను కొనసాగించారు. ఈ కృతజ్ఞతాభావంతోనే అక్కడి ప్రజలు, అధికారులు ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఘనంగా వీడ్కోలు పలికారు. 1980 లో ఎస్.జగదీషన్ తరువాత ఒక జిల్లా కలెక్టర్‌కు ఈ విధంగా గౌరవం లభించడం ఇదేనని అక్కడి స్థానికులు సంతోషంతో పేర్కొన్నారు.