
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా కాటుకు మరో ఎంపీ బలైపోయారు. ప్రాణాంతక వైరస్ బారిన పడిన రాజ్యసభ సభ్యుడు, కర్ణాటక బీజేపీ నాయకుడు అశోక్ గస్తీ(55) కన్నుమూశారు. కరోనాకు చికిత్స పొందుతూ బెంగళూరు ఆస్పత్రిలో మరణించారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సెప్టెంబరు 2న బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. ఇక ఏడాది జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అశోక్ గస్తీ ఎంపీగా ఎన్నికయ్యారు. (చదవండి: ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి)
జూలై 22న పదవీ స్వీకార ప్రమాణం చేసిన ఆయన.. ఒక్కసారి కూడా సమావేశాల్లో పాల్గొనకుండా మరణించడం పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. కాగా కర్ణాటకకు చెందిన అశోక్ గస్తీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో చేరి, తదనంతర కాలంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆక్టివిస్టుగా పనిచేశారు. ఈ క్రమంలో 18 ఏళ్ల వయస్సులోనే బీజేపీలో చేరి, కాషాయ కండువా కప్పుకొన్నారు. రాష్ట్ర యువ మోర్చా హెడ్ నుంచి రాజ్యసభ ఎంపీ వరకు అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో.. కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment