రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌  | Rashmika Mandanna's deep fakes dangerous form of misinformation, says Rajeev Chandrasekhar | Sakshi
Sakshi News home page

రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ 

Published Mon, Nov 6 2023 4:14 PM | Last Updated on Mon, Nov 6 2023 7:16 PM

Rashmika Mandanna Deep fakes dangerous form of misinformation says Rajeev Chandrasekhar - Sakshi

టాలీవుడ్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా డీప్‌ ఫేక్‌ వీడియోపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి  రాజీవ్‌ చంద్రశేఖర్‌ సీరియస్‌గా స్పందించారు. తప్పుడు సమాచారానికి సంబంధించి ప్రస్తుతం డీప్‌ ఫేక్స్‌ అత్యంత ప్రమాదకరమైనవిగా,   హానికరమైనవిగానూ  పరిణమిస్తున్నాయంటూ సోమవారం ట్వీట్‌ చేశారు. 

ఇలాంటి తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు ట్విటర్‌ వేదికగా ఐటీ చట్టంలోని పలు నిబంధనల ప్రకారం సోషల్‌ మీడియా ప్లాట్‌పాంలకు కూడా కొన్ని సూచనలు అందించారు. అలాగే ఇంటర్నెట్ వినియోగదారులకు భద్రత, విశ్వాసాన్ని కలిగించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

2023, ఏప్రిల్ నుంచిఅమల్లోకి వచ్చిన నిబంధనలు ప్రకారం సోషల్‌ బీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎలాంటి తప్పుడు సమాచారం ప్రసారం చేయకూడదని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్ర శేఖర్‌ గుర్తు చేశారు. వినియోగదారులు లేదా ప్రభుత్వం కానీ తప్పుడు సమాచారంపై ఫిర్యాదు చేసిన 36 గంటల్లో అటువంటి కంటెంట్‌ను తీసివేయవలసి ఉంటుందని  వెల్లడించారు. భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారం, ఈ నిబంధనలను పాటించకపోతే ప్లాట్‌ఫారమ్‌పై చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. ఐటీ రూల్-7 ప్రకారం కఠిన చర్యలుంటాయిని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికపై వస్తున్న ఫేక్‌ వీడియోలపై బాధితులు కోర్టును ఆశ్రయించే హక్కు ఉందన్నారు.  డీప్ ఫేక్ టెక్నాలజీతో తప్పుడు సమాచారం వైరల్ అయ్యే ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆయన ట్వీట్‌ చేశారు. 

టాలీవుడ్ నటి రష్మికకు సంబంధించి అభ్యంతర రీతిలో ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు ప్రముఖులతోపాటు,  నెటిజన్లు సైతం  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్ బచ్చన్ ఇలాంటి తప్పుడు వీడియోలపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గుడ్‌బై మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న రష్మిక  బిగ్‌బీతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

డీప్‌ ఫేక్స్‌
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ద్వారా ఫోటోలు, ఆడియో లేదా వీడియోలను మార్ఫింగ్‌ చేసి డీప్‌ఫేక్‌ వీడియోలు తయారు చేస్తారు.  మెషిన్ లెర్నింగ్  టూల్స్‌ ద్వారా న్యూరల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి ఒరిజినల్‌ వీడియోలు, ఫోటోల స్థానంలో నకిలీ ఇమేజ్‌,వీడియోలను రూపొందిస్తారు. సైబర్ నేరగాళ్లు ఖచ్చితమైన ఫేషియల్ సిమెట్రీ డేటా సెట్‌ను రూపొందించడానికి ఫేషియల్ మ్యాపింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏఐని వాడుకుంటారు. దీంతో పాటు  ఒక వ్యక్తి వాయిస్‌ని ఖచ్చితంగా కాపీ చేయడానికి వాయిస్ మ్యాచింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అలా బ్రిటీష్-ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ జరా పటేల్ నటించిన వీడియోను రష్మిక్‌ ఫేస్‌తో  డీప్‌ఫేక్ వీడియోను సృష్టించడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement