Roopa Vs Rohini: They Must Be Punished Says Home Minister - Sakshi
Sakshi News home page

రూపా Vs రోహిణి.. ఇక ఊరుకోం, కళ్లు మూసుకుని కూర్చోలేదు, చర్యలు తప్పవు!

Published Tue, Feb 21 2023 9:09 AM | Last Updated on Tue, Feb 21 2023 1:27 PM

Roopa vs Rohini: They Must Be Punished Ssays Home Minister - Sakshi

సాక్షి, బెంగళూరు:  ఐపీఎస్‌ అధికారిణి డి. రూపా మౌద్గిల్‌– ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి మధ్య మాటల పోట్లాట సోమవారం సర్కారు వద్దకు చేరింది. రోహిణిపై రూపా ఫేస్‌బుక్‌ ద్వారా రెండురోజులుగా తీవ్రమైన ఆరోపణల పరంపరను సాగించారు. రోహిణి కూడా ప్రత్యారోపణలు చేశారు. రూపా మానసిక వైద్యం చేయించుకోవాలని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ యంత్రాంగానికి రెండు కళ్ల వంటి ఐపీఎస్‌– ఐఏఎస్‌ అధికారులు, అందులోనూ ఇద్దరూ మహిళలు దూషణలకు దిగడంతో ప్రభుత్వం ఆలస్యంగానైనా మేలుకుంది. వారిద్దరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మ సోమవారం విధానసౌధకు వేర్వేరుగా పిలిపించి వివరణలు తీసుకున్నారు. ఇకపై నోరు మెదపరాదని ఆదేశించినట్లు తెలుస్తోంది.  

రూపావన్నీ తప్పుడు ఆరోపణలు: రోహిణి  
సీఎస్‌ను కలిసిన తరువాత ఐఏఎస్‌ రోహిణి విధానసౌధ బయట మీడియాతో మాట్లాడారు. రూపా గురించి సీఎస్‌కు 4 పేజీల ఫిర్యాదు లేఖను అందజేసినట్లు తెలిపారు. సోషల్‌ మీడియా, మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసి సర్వీస్‌ రూల్స్‌ను  ఉల్లంఘించిన ఐపీఎస్‌ అధికారి రూపామౌద్గిల్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆమె నా వ్యక్తిగత జీవితంపై మాట్లాడింది, నేను సోషల్‌ మీడియాలో చురుకుగా లేను. వ్యక్తిగత ఆరోపణలు పట్ల నా భర్త మాట్లాడారని రోహిణి చెప్పారు.  జాలహళ్లిలో ఉన్న ఆస్తి గురించి రూపా ప్రస్తావించారు, ఆ ఆస్తి నా భర్త తల్లికి చెందినదని, తమది కాదని పేర్కొన్నారు.  

సీఎస్‌ను కలిపిన రూపా  
ఐపీఎస్‌ అధికారి రూపా మౌద్గిల్‌ కూడా సీఎస్‌ వందితా శర్మను కలిసి వివరణ ఇచ్చారు. ఐఏఎస్‌ రోహిణి సింధూరి అవినీతి అక్రమాలకు పాల్పడిందని రూపా ఫిర్యాదు చేశారు. రోహిణిపై లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఫేస్‌బుక్‌లో తెలిపారు.   

ఐపీఎస్‌కు ఎంపీ మద్దతు 
ఐపీఎస్‌ అధికారిణి డి.రూపా అడిగిన ప్రశ్నలు నైతికంగా సరైనవేనని, వాటికి రోహిణి, ఆమె బంధువులు సమాధానం ఇవ్వాలని మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహా అన్నారు. మైసూరులో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రతాప్‌ సింహా మాట్లాడుతూ చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 24 మంది కోవిడ్‌ బాధితులు మరణించారని, ఆ ఆస్పత్రికి ఆక్సిజన్‌ సరఫరా చేసే బాధ్యత మైసూరు జిల్లాధికారిదని అన్నారు. ఆ సమయంలో జిల్లాధికారిగా ఉన్న రోహిణి సింధూరి దీనికి పూర్తి బాధ్యత వహించాలని, ఆమె బదులివ్వాలని అన్నారు.   

ఇక ఊరుకోం: న్యాయమంత్రి  
ఇద్దరు అధికారులూ ఇలాగే పరస్పర దూషణలకు దిగితే చర్యలు తప్పవని న్యాయ మంత్రి మాదుస్వామి విధానసౌధలో తెలిపారు. ఇప్పటివరకు వ్యక్తిగత విషయం అని ఊరుకున్నామని, విధానసౌధ వరకు వచ్చింది కాబట్టి ఇక మేము ఊరుకునేదిలేదని, ముఖ్యమంత్రితో చర్చించి  చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


విధానసౌధ వద్ద మీడియా  ముందుకు వస్తున్న ఐఏఎస్‌ రోహిణి సింధూరి 

వదిలిపెట్టేది లేదు: రోహిణి 
ఈ విషయాన్ని వదిలిపెట్టేదిలేదని రోహిణి హెచ్చరించారు. వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేయడం తగదు, ఏదైనా ఉంటే ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదు, అన్ని చర్యలకూ సిద్దంగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రొఫెషనల్‌గా మాట్లాడాలి కానీ పర్సనల్‌గా  కాదన్నారు. రూప నాపై దుష్పచారం చేయడం తప్పు, చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటానని తెలిపారు. గెట్‌ వెల్‌ సూన్‌ అని కౌంటర్‌ ఇచ్చారు.

ఇద్దరిపైనా చర్యలు తప్పవు: హోంమంత్రి జ్ఞానేంద్ర 
ఐపీఎస్‌– ఐఏఎస్‌ల గొడవను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారి వ్యవహారంపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేదని, చర్యలు తీసుకుంటామని, ఇద్దరు అధికారురూ హద్దుమీరి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి వ్యక్తిగత విషయం ఏమైనా చేసుకోని, కానీ మీడియా ముందు బహిరంగంగా మాట్లాడటం సరికాదన్నారు.

ఐఏఎస్, ఐపీఎస్‌ అంటే ప్రజాసేవకులని, కానీ వారు ఆ హోదాలకు అవమానం చేశారని ఆయన అన్నారు. సీఎస్, డీజీపీ తో మాట్లాడానని, సీఎం బొమ్మై సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చట్టపరంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement