![Sabarimala To Deliver Prasadam For Devotees Through Speed Post - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/2/sabarimala.jpg.webp?itok=pAu36dUQ)
తిరువనంతపురం: ఈ సీజన్‌లో మాత్రమే దొరికే శబరిమల అరవణ పాయసం భక్తులకు ఎంతో ప్రీతిదాయకం. కోవిడ్ మహమ్మారి వ్యాప్తితో ఎక్కువ మంది భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో శబరిమల సందర్శించే వారి సంఖ్య లక్షల నుంచి వందలకు పడిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న శబరిమల భక్తులకు స్వామి ప్రసాదం ఇంటి వద్దకే అందజేయాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. ఆ వెంటనే శబరిమల ప్రసాదాన్ని భక్తులకు డెలివరీ చేసేందుకు కేరళకు చెందిన పోస్టల్ సర్కిల్ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రసాదం పంపిణీ కోసం సమగ్ర బుకింగ్, డెలివరీ ప్యాకేజీని అభివృద్ధి చేసినట్లు మంగళవారం అధికారికంగా పత్రికా ప్రకటన చేసింది. చదవండి: (మంచు కొండల్లో పెరిగిన పొలిటికల్ హీట్..)
ప్రసాదం కిట్ ధర రూ.450 గా ప్రకటించింది. ఇందులో అరవణ పాయసం, విభూతి, కుంకుమ, పసుపు, నెయ్యి, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయని తెలిపారు. ఒక వ్యక్తి ఒకేసారి 10 వరకు ప్రసాదం కిట్స్‌ని ఆర్డర్ చేయవచ్చని, అంతకన్నా ఎక్కువ కావాలంటే మరో రిసిప్ట్ పైన బుక్ చేయాలని పేర్కొన్నారు. స్పీడ్ పోస్ట్లో ప్రసాదం బుక్ అయిన వెంటనే, స్పీడ్ పోస్ట్ నంబర్ ఎస్ఎంఎస్ ద్వారా భక్తుడికి వస్తుంది. ఆ నంబర్‌తో ఇండియా పోస్టల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ప్రసాదం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చని వివరించారు. ఈ సేవను నవంబర్ 16 నుంచి ప్రారంభించామని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు. ఇప్పటికే దేశమంతటా 9,000 ఆర్డర్లు బుక్ చేయబడ్డాయని, ఈ సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతుందన్నారు.
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏడు నెలలుగా మూసివేసిన ఆలయాన్ని కొన్ని నిబంధనలతో అక్టోబర్ 16 నుంచి తెరిచారు. నవంబర్ 16 నుంచి అయ్యప్ప మాల వేసుకునే వారిని అనుమతించారు. అయితే రోజు వారీగా పరిమిత సంఖ్యలో అనుమతించడం, కఠినమైన ఆంక్షలు నేపథ్యంలో శబరిమలను సందర్శించే వారి సంఖ్య బాగా తగ్గిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment