ప్రయాణికులంతా సురక్షితం
కాన్పూర్/న్యూఢిల్లీ: వారణాసి– అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్‌ప్రెస్ శనివారం యూపీలో పట్టాలు తప్పింది. పట్టాలపైనున్న ఒక వస్తువు రైలింజిన్‌ను బలంగా తాకడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్–భీమ్‌సేన్ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 2.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పెద్ద శబ్దంతో బోగీలు ఊగుతూ, రైలు నిలిచిపోవడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేచారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులందరినీ బస్సుల్లో కాన్పూర్ రైల్వే స్టేషన్‌కు, అక్కడికి నుంచి వేరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
కుట్ర కోణంలో దర్యాప్తు
‘రైలు పట్టాలపైనున్న ఓ వస్తువు ఇంజిన్‌ను తాకినట్లు ఆనవాళ్లున్నాయి. అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. యూపీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు’అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘బండరాయి వంటిదేదో గట్టిగా గుద్దుకోవడంతో ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని, వంగిపోయినట్లు లోకో పైలట్ చెబుతున్నారు. 16వ బోగీ సమీపంలో మాకు దొరికిన వస్తువే ఇంజిన్ దెబ్బతినేందుకు కారణమై ఉండొచ్చు. ఇది సంఘ వ్యతిరేక శక్తుల పని’గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment