అమృతసర్/చండీగఢ్: పంజాబ్‌లో తీవ్రవాదం అంతానికి పోరాడిన, శౌర్యచక్ర పురస్కార గ్రహీత బల్వీందర్ సింగ్ సంధూ దుండగుల కాల్పుల్లో చనిపోయారు. ఆయనకు కల్పించిన భద్రతను ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పంజాబ్‌లోని తరన్‌తారన్ జిల్లా బిఖివిండ్ పట్టణంలో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తన కార్యాలయంలో ఉన్న బల్వీందర్ సింగ్ సంధూపై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన చనిపోయారు. తమకు ఎవరితో శత్రుత్వం లేదని, తీవ్రవాదుల ఘాతుకమే ఇదని సంధూ భార్య జగదీశ్ కౌర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తమపై 62 దాడులు జరిగాయని, తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని, భద్రత కల్పించాలని డీజీపీని పలుమార్లు అభ్యర్థించామని, అయినా వారు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. సంధూ మృతికి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దోషులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సంధూపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని అంతమొందించేందుకు బల్వీందర్ సింగ్ అలుపెరగని పోరాటం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment