లక్నో: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతిరోజు వేలాదిగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు కోవిడ్ కట్టడికి లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కరోనా నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
అయితే కల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదన్నట్లు లాక్‌డౌన్‌లో పెళ్లిళ్లు సహా ఇతరత్రా వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ వేడుకలు అతి కొద్దిమంది సమక్షంలోనే జరుగుతున్నాయి. అయితే, తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఒక పెళ్లిలో కరోనా నిబంధనలను అతిక్రమించడమే కాకుండా, మండపంలో వధువు రివాల్వర్‌ను పైకెత్తి ఆకాశంలో కాల్పులు జరిపింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని జేత్వారాలో జరిగిన ఒక వివాహ వేడుకలో వధువు రూపా పాండె, వరుడితో కలసి పెళ్లి మండపానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె, తన మేనమామ రామ్నివాస్ పాండె రివాల్వర్‌ను తీసుకుంది. వివాహ వేదికపైకి ఎక్కుతున్న క్రమంలో ఒక్కసారిగా గాలిలో కాల్పులు జరిపింది. ఆ తర్వాత రివాల్వర్‌ను తన మామకు అప్పగించింది. అయితే, ఆ రివాల్వర్‌కు లైసెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో యూపీ పోలీసుల కంట పడటంతో పెళ్లి కూతురిని, ఆమె మేనమామ రామ్నివాస్‌లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అతని రివాల్వర్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నట్లు ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివాహా వేడుకకు కేవలం 25 మందికి మాత్రమే అనుమతి ఉంది. కానీ అక్కడ అంతకన్నా ఎక్కువ మంది జనం హాజరయ్యారు. దీంతో వీరందరిపై అంటు వ్యాధులు నిరోధక చట్టం కింద కేసులను నమోదు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment