Rajiv Gandhi's Political Career Ended In Very Brutal Manner, Says Sonia Gandhi - Sakshi
Sakshi News home page

నా భర్త రాజకీయ జీవితం కిరాతకంగా ముగిసింది.. సోనియా 

Published Mon, Aug 21 2023 12:13 PM | Last Updated on Mon, Aug 21 2023 12:27 PM

Sonia Says Rajiv Gandhis Political Career Ended In Very Brutal Manner - Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో తన భర్త రాజకీయ జీవితం అత్యంత క్రూరంగా ముగిసిందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్బంగా వీర్ భూమిలో ఆయనకు నివాళులర్పించి ఢిల్లీలోని జవహర్ భవన్‌లో జరిగిన జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు సోనియా గాంధీ. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, మరికొంత మంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

25వ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ.. నా భర్త రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం చాలా తొందరగా అత్యంత కిరాతకంగా ముగిసినప్పటికీ ఆయన ఈ కొంత కాలంలోనే ఎవ్వరికి సాధ్యం కాయాన్ని ఎన్నో ఘనతలు సాధించారన్నారు. ఆయనకు దొరికిన కొద్దిపాటి సమయంలోనే దేశం కోసం, ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఎంతో చేశారని జ్ఞాపకము చేశారు. 

రాజీవ్ గాంధీ ముందుచూపుతో వ్యవహరించడం వల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా పంచాయతీల్లోనూ, మున్సిపల్ కార్యవర్గాల్లోనూ మహిళలు సుమారు 15 లక్షల మంది ఉన్నారన్నారు. ఇదంతా ఆనాడు రాజీవ్ గాంధీ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లో మహిళలకు మూడో వంతు స్థానం కల్పించడానికి చేసిన కృషి ఫలితమేనన్నారు. అలాగే ఓటు హక్కును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు కుదించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు.             
 
ఈ సందర్బంగా సోనియా గాంధీ ప్రస్తుత పరిస్థితుల గురించి వివరిస్తూ మత సామరస్యాన్ని చెడగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ విద్వేషాలను రెచ్చగొట్టడమే ప్రధాన ఎజెండాగా చేసుకుంటున్నారు. వీరికి మరికొంత మంది మద్దతు తెలపడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నారు. రాజీవ్ గాంధీ మత, జాతి, భాష, సంస్కృతులను సున్నితమైన అంశాలుగా చెబుతూ వీటిని అందరం కలిసి పండగలా నిర్వహించుకుంటేనే జాతి ఐక్యత సాధ్యమని నమ్మేవారన్నారు. 

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం 40 ఏళ్ల వయసులో ప్రధాన మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1989 డిసెంబర్ 2 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1944, ఆగస్టు 24న జన్మించిన ఆయన ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో 1991, మే 21న మృతి చెందారు. 

ఈ జాతీయ సద్భావనా అవార్డు 2021-22 సంవత్సరానికి గాను రాజస్థాన్ లోని గురుకుల పాఠశాల బానస్థలి విద్యాపీఠ్ మహిళల గురుకుల సంస్థకు అందజేశారు. ఆ సంస్థ తరపున సిద్దార్ధ శాస్త్రి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.  

ఇది కూడా చదవండి: ‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement