రెండు రోజులుగా దేశమంతా ఎటు చూసినా బాలరాముడే. ఎక్కడ విన్నా అతన్ని గురించిన చర్చే. సోషల్ మీడియాలోనూ అయోధ్యలో కొలువుదీరిన రామ్ లల్లా ముచ్చట్లే. అతని ఫొటోలే. అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నది బాలరాముని మందస్మిత వదనం. సమ్మోనమైన ఆ నవ్వుకు సెలబ్రిటీలు మొదలుకుని సామాన్యుల దాకా అందరూ ముగ్ధులవుతున్నారు. అమితమైన కరుణతోపాటు అంతులేని దివ్యత్వాన్ని వర్షిస్తున్న ఆ కళ్లు నిజంగా అద్భుతమంటూ కొనియాడుతున్నారు.
అదే సమయంలో బాలలకు సహజమైన అమాయకత్వంతో చూస్తున్న ఆ నయనాల సొగసు వర్ణనాతీతమని ముక్త కంఠంతో చెప్తున్నారందరూ. బాలరాముని కళ్లను అంత అందంగా తీర్చిదిద్దినందుకు మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రతిభను ఎంత పొడిగినా తక్కువేనంటున్నారు. విగ్రహ రూపకల్పనకు, ముఖ్యంగా కళ్లను అంతలా తీర్చిదిద్దేందుకు ఆయన అక్షరాలా తపస్సే చేశారు. చిన్నపిల్లల ముఖ కవళికలను దగ్గరగా ఒడిసిపట్టేందుకు ఎన్నోసార్లు స్కూళ్లకు వెళ్లారు.
శిల్ప శాస్త్రాన్ని ఆమూలాగ్రం పదేపదే అధ్యయనం చేశారు. అరుణ్ దీక్ష, శ్రమ, పట్టుదలకు రాముని కరుణ తోడైందని భార్య విజేత చెబుతున్నారు. విగ్రహ రూపకల్పనకు అనువైన కృష్ణ శిలను ఎంచుకోవడం వంటివాటి వెనక దాగున్న సాంకేతికత మొదలుకుని దాన్ని అత్యంత అందంగా చెక్కేదాకా ప్రతి దశలోనూ అరుణ్ ఎదుర్కొన్న సవాళ్లు తదితరాలను ఆమె మీడియాతో వివరంగా పంచుకున్నారు.
శాస్త్ర ప్రమాణాల మేరకు...
విగ్రహ తయారీలో అరుణ్ పూర్తిగా శిల్ప శాస్త్ర ప్రమాణాలను అనుసరించారు. ఆ మేరకే బాలరాముని ముఖారవిందపు స్వరూప స్వభావాలను ఖరారు చేశారు. ముఖ్యంగా కళ్లు, ముక్కు, చుబుకం, పెదాలు, చెంపల నిష్పత్తి తదితరాలను శాస్త్రంలో నిర్దేశించిన మేరకు నిర్ణయించారు. ‘‘అరుణ్ చేతిలో నిజంగా అద్భుతమైన కళ దాగుంది. విగ్రహం ఎలా ఉండాలో రామ జన్మభూమి ట్రస్టు ప్రతినిధులు క్లుప్తంగా చెప్పారు.
నవ్వుతున్న ముఖం, దివ్యత్వం, ఐదేళ్ల స్వరూపం, రాకుమారుని రాజసం... ఇవీ అరుణ్‌తో పాటు మరో ఇద్దరు శిల్పులు జీఎల్‌భట్, సత్యనారాయణ పాండేకు వాళ్లు నిర్దేశించిన ప్రాతిపదికలు. అవి మినహా మిగతాదంతా అరుణ్ ఊహ, భావుకతల ఫలమే. ఇందుకోసం చిన్నపిల్లల స్కూళ్లకు వెళ్లి గంటల కొద్దీ గడిపాడు. వాళ్ల ముఖ కవళికలు, అవి పలికించే భావాలను లోతుగా పరిశీలించాడు.
వాటిని పేపర్‌పై ఎప్పటికప్పుడు స్కెచ్‌లుగా గీసుకున్నాడు. అవయవాల పొందిక నిమిత్తం శరీర నిర్మాణ శాస్త్ర పుస్తకాలు తిరగేశాడు. అందుకే విగ్రహం అంత వాస్తవికంగానూ, అదే సమయంలో ఎంతో ముగ్ధమనోహరంగానూ రూపుదిద్దుకుంది’’ అని విజేత వివరించారు. ‘‘అరుణ్ నిజంగా అత్యంత అదృష్టశాలి. మా ఆయనతో రాముడే ఇంతటి మహత్కార్యం చేయించుకున్నాడు’’ అంటూ మురిసిపోయారు.
గుండ్రని ముఖమండలం...
ఉత్తరాది సంప్రదాయంలో రూపొందే శిల్పాల ముఖం, ముఖ లక్షణాలు కాస్త కొనదేరి ఉంటాయి. అయోధ్య బాలరాముని ముఖమండలం గుండ్రని రూపుతో కనువిందు చేస్తోంది. ఇది దక్షిణాదిలో శిల్పాల రూపకల్పనలో ఎక్కువగా కని్పస్తుందని ఢిల్లీలోని ప్రముఖ చరిత్రకారుడు, రచయిత విక్రం సంపత్ అన్నారు. ‘‘కానీ కాస్త చక్కని చుబుకం, ఉబ్బెత్తు చెంపలు, బుల్లి పెదాలు, వాటిపైనే గాక ముఖమంతటా పరుచుకున్న మార్మిక మందహాసం... ఇలాంటి దివ్య లక్షణాలన్నీ బాలరాముని ముఖంలో ప్రస్ఫుటమవుతున్న తీరు మాత్రం నిజంగా అద్భుతమేనని చెప్పారాయన. ఈ విషయంలో శిల్పిగా అరుణ్ పనితనాన్ని ఎంత పొగిడినా తక్కువేనన్నారు.
51 అంగుళాల వెనక...
రామ్ లల్లా విగ్రహం ఎత్తును 51 అంగుళాలుగా నిర్ణయించడం వెనక కూడా శాస్త్రీయ కారణాలున్నట్టు విజేత చెప్పారు. ‘‘ఏటా రామనవమి రోజున సూర్య కిరణాలు సరిగ్గా బాలరాముని నుదిటిపై పడాలన్నది ట్రస్టు నిర్ణయం. ఆలయ నిర్మాణం తదితరాల దృష్ట్యా విగ్రహం సరిగ్గా 51 అంగుళాల ఎత్తుంటేనే అది సాధ్యం’’ అన్నారు. అవసరమైన మేరకు పలు విషయాల్లో పలురకాల సాఫ్ట్‌వేర్ల సాయమూ తీసుకున్నా అంతిమంగా కేవలం సుత్తి, ఉలి ఉపయోగించి విగ్రహాన్ని ఆసాంతం అరుణ్ తన చేతులతోనే చెక్కారని వివరించారు.
కృష్ణ శిలే ఎందుకు?
విగ్రహ రూపకల్పనకు కృష్ణ శిలనే ఎంచుకోవడం వెనక శాస్త్రీయ కారణాలున్నాయి. ఆమ్లాలతో ఈ శిల ప్రతి చర్య జరపదు. వేడి, తీవ్ర వాతావరణ చర్యలకు కూడా స్పందించదు. ‘‘కనుక పాలు తదితరాలతో అభిషేకం చేసినప్పుడు వాటితో చర్య జరపదు. దాంతో రెండు లాభాలు. వాటిని ప్రసాదంగా తీసుకున్నా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావమూ ఉండదు.
ఈ లక్షణం వల్ల విగ్రహం కనీసం వెయ్యేళ్ల దాకా చెక్కుచెదరదు. దానిపై కనీసం గీత కూడా పడదు’’ అని విజేత వివరించారు. అత్యున్నత నాణ్యతతో కూడిన కృష్ణ శిలలు కొన్నిచోట్ల మాత్రమే దొరుకుతాయి. బాలరామున్ని రూపొందించేందుకు వాడిన కృష్ణ శిల ఆ కోవలోదేనని విజేత చెప్పారు. ఇది మైసూరు సమీపంలోని హెచ్‌డీ కోటె దగ్గర లభ్యమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment