భోపాల్: వైద్యవిద్య ప్రవేశానికి నిర్వహిస్తున్న నీట్ పరీక్ష పలువురు విద్యార్థులను నిలువునా ముంచేసింది. పబ్లిక్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించిన వారికి నీట్‌లో సున్నా మార్కులు రావడంతో హతాశులయ్యారు. ఇదే కోవలోనే డాక్టర్ కావాలనుకున్న ఓ అమ్మాయికి నీట్ ఫలితాలు జీవితాన్ని ముగించేలా చేశాయి. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన విధి సూర్యవంశీ అనే అమ్మాయి నీట్‌లో మంచి మార్కులు వస్తాయని ఊహిస్తే ఫలితాల్లో కేవలం 6 మార్కులే రావడంతో షాక్‌కు గురైంది.
ఏం చేయాలో పాలుపోని స్థితిలో విధి తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే తమ కుమార్తెకు ఇంత తక్కువ మార్కులు వస్తాయని తల్లిదండ్రులు కూడా నమ్మలేకపోయారు. దీంతో వారు ఓఎమ్‌ఆర్ సీటును తెప్పించి చూడగా విధి 720కి గానూ 590 మార్కులు సాధించి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైనట్లు తేలింది. విధి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. (నీట్ గందరగోళం.. టాపర్‌ని ఫెయిల్ చేశారు)
కాగా.. నీట్ 2020 ఫలితాలను అక్టోబర్ 16న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఒడిశాకు చెందిన సోయెబ్ అఫ్తాబ్, ఢిల్లీకి చెందిన ఆకాంక్షసింగ్ నీట్ ఎంట్రన్స్ 2020లో 720 మార్కులకు గానూ 720 మార్కులు సాధించి చరిత్ర సృష్టించారు. ఆలిండియా స్థాయిలో 15,97,435 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, వీరిలో 13,66,945 (85.57 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. (సున్నా మార్కులు.. కోర్టులో పిటిషన్)
Comments
Please login to add a commentAdd a comment