అమ్మాయికి 20 ఏళ్లు వచ్చాయంటే చాలు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనే చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బునంతా కూతురు చదువుకు పెట్టి అప్పటి వరకు ఏ లోటు లేకుండా చూసుకున్న పేరేంట్స్ ఆమె మంచి స్థాయిలో స్థిరపడ్డాక పెళ్లి పేరుతో తన జీవితానికి సంకేళ్లు వేస్తుంటారు. దీనికి తోడు మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదా అంటూ చుట్టుపక్కల వాళ్లు, బంధువుల సూటిపోటి మాటలు ఒకటి. దీంతో తన ఆశలను అటు తల్లిదండ్రులకు చెప్పలేక, ఇటు తనలో తాను కుమిలిపోయి చివరికి ఆత్మహత్య శరణమనుకునే యువతులు కోకొల్లలు. ఈ కోవలోకి అందరూ రాకపోయినా ఎక్కడో ఒక్కచోట నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. చూస్తూనే ఉన్నాం.
తాజాగా పెళ్లి కావడం లేదన్న బాధను తట్టుకోలేక ఎస్సైగా పని చేసే యువతి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రత్‌లామ్ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్‌లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ఒక బాధ్యతాయుతమైన పోలీసు ఆఫీసర్. ఎంతో కష్టపడితే గానీ ఆ కొలువును సాధించలేము. ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఆమెకు 35 సంవత్సరాలు. సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆమెకు ఓ ఘటన ఎదురైంది. పెళ్లి ఎప్పుడంటూ ఇంటి దగ్గర ఉన వాళ్లంతా ప్రశ్నించడం మెదలు పెట్టారు..ఇప్పుడే కాదు ఇంటికి వెళ్లిన ప్రతీ సారి ఇదే అడగుతుండటంతో ఆవేదన చెందింది. దీంతో ఇంటి నుంచి బయలుదేరి తిరిగి డ్యూటీలో జాయిన్ అయింది.
బుధవారం రాత్రి అధికార నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత తన స్నేహితురాలికి ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పడంతో ఆమె హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు గురువారం ఆమె మరణించింది. మృతురాలి ఇంట వద్ద నుంచి సుసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో.. తనకు పెళ్లి కావడం లేదని ఆందోళన చెందుతున్నట్లు, వివాహంపై ఇరుగుపొరుగు వారి మాటలకు సమాధాన చెప్పలేక అలసి పోయానని రాసుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment