సాక్షి, న్యూఢిల్లీ: తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. లాక్‌డౌన్ సమయంలో మార్చిలో పెద్ద సంఖ్యలో ఈ వాహనాల అమ్మకంపై కూడా అత్యున్నత కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అసాధారణ సంఖ్యలో బీఎస్-4 వాహనాలు అమ్ముడు కావడం పట్ల జస్టిస్ అరుణ్శర్మ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై ఆగస్టు 13న విచారణ చేపడతామని ప్రకటించింది.
లాక్‌డౌన్ ముగిసిన తర్వాత 10 రోజుల పాటు బీఎస్-4 వాహనాలను విక్రయించడానికి కార్ల డీలర్లకు కోర్టు అనుమతినిచ్చింది. జూన్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఆటో డీలర్లకు(ఫాడా) సడలింపునిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే బీఎస్-4 వాహనాలను
నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్టు తమ దృష్టికి వచ్చిందని కోర్టు తెలిపింది. మార్చి 27 తర్వాత 2.55 లక్షల బీఎస్-4 వాహనాలు అమ్ముడయ్యాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులో 1.05 లక్షల బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు మాత్రమే కోర్టు అనుమతినిచ్చింది.
ఈ క్రమంలో లాక్‌డౌన్ ముగిసిన తరువాత 15 రోజుల పాటు బీఎస్-4 వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాలని ఫాడా ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. బీఎస్-4 వాహన విక్రయాల వివరాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు ధృవీకరణ కోసం సమర్పించాలని జూలై 8న కార్ల డీలర్ల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. 17,000 వాహనాల వివరాలను మాత్రమే వాహన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment