
న్యూఢిల్లీ: అనుచిత ప్రవర్తన ఆరోపణలెదుర్కొంటున్న సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రాకు షోకాజ్ నోటీసు పంపాలని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ నిర్ణయించింది. ఆయనకు ఇచ్చిన సీనియర్ హోదాను ఎందుకు తొలగించరాదో తెలిపాలని కోరనుంది. సీనియర్ లాయర్‌కు సుప్రీంకోర్టు ఫుల్‌బెంచ్ ఇలా నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుప్రీం జడ్జీలందరూ హాజరై ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.
షోకాజ్ నోటీసు ఇవ్వాలని సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్‌ను కోరారు. సీనియర్ హోదాను రద్దు చేసుకునేందుకు ముందుగా వాదనను వినిపించేందుకు మల్హోత్రాకు ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 20వ తేదీన ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్‌ల ధర్మాసనం మల్హోత్రా తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్నిసార్లు హెచ్చరించినా కోర్టును తప్పుదోవ పట్టించడం మానుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
శిక్షాకాలం పూర్తి కాకమునుపే ఖైదీలను విడిపించే ప్రయత్రాల్లో భాగంగా వాస్తవాలను దాచినట్లు మల్హోత్రాపై ఆరోపణలు చేసింది. ఆయనకు ఇచ్చిన సీనియర్ గుర్తింపు రద్దు చేసే విషయాన్ని ప్రధాన న్యాయమూర్తికే వదిలేస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఫుల్ బెంచ్ షోకాజ్ నోటీసు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. కాగా, మల్హోత్రాకు సుప్రీంకోర్టు 2024 ఆగస్ట్ 14న సీనియర్ లాయర్ హోదా ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment