న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పెగసస్ నిఘా సాఫ్ట్‌వేర్‌తో హ్యాకింగ్ ఉదంతంపై బెంగాల్ ప్రభుత్వం వేరుగా విచారణ చేయించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎంబీ లోకూర్ ఆధ్వర్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించిన కమిటీ దర్యాప్తుపై స్టే విధించింది. ఇప్పటికే పెగసస్ హ్యాకింగ్‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెగసస్‌పై దర్యాప్తు చేయించబోమంటూ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన తర్వాత కూడా బెంగాల్ ప్రభుత్వం వేరుగా విచారణ కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం విచారణ చేపట్టింది.
‘లోకూర్ కమిషన్ విచారణ ఉండదని గతంలో బెంగాల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా! కానీ, మళ్లీ దర్యాప్తు కొనసాగుతోంది. ఏమిటిది?’అని ప్రశ్నించింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలకు తెలియజేస్తానని బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ లాయర్ ఏఎం సింఘ్వి ధర్మాసనానికి నివేదించారు. న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వెలువరించేదాకా లోకూర్ కమిషన్ తన విచారణను నిలిపివేస్తుందని ఆయన తెలిపారు. స్పందించిన ధర్మాసనం..‘రాష్ట్ర ప్రభుత్వం సంకటస్థితి అర్థమైంది. పెగసస్ హ్యాకింగ్ విషయంలో దర్యాప్తును నిలుపుదల చేయాలని సంబంధిత అన్ని వర్గాలకు నోటీసులు ఇస్తున్నాం’అని పేర్కొంది. భారత్‌లోని వివిధ వర్గాలకు చెందిన 300 మంది ఫోన్లపై పెగసస్ స్పైవేర్ నిఘా పెట్టిందంటూ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ బయటపెట్టిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment