ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. కాగా, ఆమె హత్యకు సంబంధించి ఒక నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇక, మృతురాలిని స్విట్జర్లాండ్‌కు చెందిన 30 ఏళ్ల లీనా బెర్గర్‌గా గుర్తించారు. ఈ కేసులో నిందితుడి ఇంట్లో నుంచి భారీగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల ప్రకారం.. లీనా బెర్గర్ వారం రోజుల కిందట భారత్‌కు వచ్చింది. అయితే, శుక్రవారం పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్రభుత్వ స్కూల్ వద్ద ఉన్న చెత్త పడేసే నల్లని ప్లాస్టిక్ బ్యాగ్‌లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇందులో భాగంగా ఆమెతో సంబంధం ఉన్న గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గురుప్రీత్ సింగ్ తరచుగా స్విట్జర్లాండ్ వెళ్లి లీనాను కలిసేవాడు. వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా లవ్ ట్రాక్ నడుస్తోంది. అయితే, ఆమెకు మరొకరితో సంబంధం ఉన్నట్లు అనుమానించాడు. ఈ నేపథ్యంలో లీనాను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. భారత్‌కు రావాలని ఆమెను పిలిచాడు. దీంతో అక్టోబర్ 11న లీనా ఢిల్లీ చేరుకుంది. ఐదు రోజుల తర్వాత ఆమెను ఒక గదిలో బంధించాడు. కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశాడు.
మరోవైపు ఆమె పేరుతో కొనుగోలు చేసిన పాత కారులో లీనా మృతదేహాన్ని గురుప్రీత్ ఉంచాడు. దుర్వాసన రావడంతో చెత్త పారవేసే ప్లాస్టిక్ బ్యాగ్‌లో మృతదేహాన్ని ఉంచి ప్రభుత్వ స్కూల్ ముందు పడేశాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి గురుప్రీత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని ఉంచిన కారుతోపాటు మరో కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అతడి ఇంటి నుంచి రూ.2.25 కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Comments
Please login to add a commentAdd a comment