సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రోజుల క్రితం మన దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీకా తొలుత ఆరోగ్య సిబ్బందికి ఇచ్చారు. ఆ తర్వాత సామాన్యులకు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ టీకా తీసుకోవాలనుకునే వారికి నిపుణులు ఓ సలహా ఇస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్నవారు 45 రోజుల పాటు మద్యం తీసుకోకూడదని సూచించారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం పడుతుందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్నవారు.. ఇప్పటికే తీసుకున్న వారు కొన్ని వారాల పాటు మద్యానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
(చదవండి: కోవాగ్జిన్ సైడ్ ఎఫెక్ట్స్.. 14రకాలు)
ఈ సందర్భంగా నేషనల్ కోవిడ్ టాస్క్ఫోర్స్ చైర్మన్ సుదర్శన్ మాట్లాడుతూ.. ‘‘ముప్పై రోజుల వ్యవధిలో టీకా రెండు డోసులు తీసుకోవాలి. సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాతనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యం సేవిస్తే.. అది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు ఆటంకం కలిగిస్తుంది. ఇది పూర్తిగా వాస్తవం. ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం వ్యాక్సిన్ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే మద్యానికి దూరంగా ఉండాలి. సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు డాటా వెల్లడిస్తుంది. అందువల్ల టీకా తీసుకోవాలనుకునే వారు.. ఇప్పటికే తీసుకున్న వారు ఓ 45 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండటం మేలు’’ అన్నారు.
(చదవండి: టీకానంతరం దుష్ఫలితాలు వస్తే..)
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు 3.8 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వారిలో 580 మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించగా, ఏడుగురు ఆసుపత్రి పాలయ్యారు. ఇద్దరు మరణించారు. అయితే ఇది వ్యాక్సిన్‌కి సంబంధించి మరణాలు కాదని వైద్యులు నిర్ధారించారు. ఏడుగురు ఆసుపత్రి పాలవగా, ఇద్దరు మరణించారు. అయితే ఇది వ్యాక్సిన్‌కి సంబంధించినది కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment