సేలం రైల్వే స్టేషన్‌లో రిజర్వేషన్ బోగీల్లో ఎక్కిన వలస కార్మికులను కిందికి దించుతున్న పోలీసులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వలస కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న కార్మికులంతా తమ వాళ్లేనని, వారికి ఎటువంటి హాని జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. అదేవిధంగా, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగనివ్వమన్నారు. వదంతులు వ్యాప్తి చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తమిళనాడులో బిహార్, జార్ఖండ్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో స్టాలిన్ శనివారం నితీశ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవనీయ సోదరుడు నితీశ్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు అందులో చెప్పారు. బిహార్ సహా ఉత్తరాది వలస కార్మికుల భద్రతపై ఆయనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బిహార్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ తమిళనాడులో వలసకార్మికులపై దాడులపై ఒక ఫేక్ వీడియోను మొదట ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వలస కార్మికులు పేర్లు నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.
కార్మికులకు నచ్చజెప్పిన పోలీసులు
ఉత్తరాది వలస కార్మికులపై దాడుల పుకార్ల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు భయంతో స్వస్థలాలకు బయలు దేరారు. దీంతో బస్, రైల్వే స్టేషన్లు నిండిపోయాయి. రిజర్వేషన్ రైలు బోగీల్లో కార్మికులు పెద్దఎత్తున ఎక్కడంతో శనివారం వారికి పోలీసులు నచ్చజెప్పి కిందికి దించివేశారు. కాగా, ఈ వ్యవహారంపై బిహార్, జార్ఖండ్ ప్రభుత్వాలు తమిళనాడు అధికారులతో సంప్రదింపులు జరిపాయి. అలాగే ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు తమిళనాడుకు శనివారం చేరుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాయి. కాగా, వదంతుల వీడియోలకు సంబంధించి పోలీసులు బీజేపీ అధికార ప్రతినిధులు తదితరులపై కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment