Tamil Nadu Govt Prepare For A Possible Covid - 19 Third Wave - Sakshi
Sakshi News home page

మూడో యుద్ధానికి సిద్ధం!

Published Wed, Aug 4 2021 7:08 PM | Last Updated on Thu, Aug 5 2021 9:00 AM

Tamil Nadu Government Prepare For Covid 3rd Wave - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి ప్రతినిధి, చెన్నై: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదురొడ్డి నిలిచేందుకు సర్వసన్నాహాలు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. థర్డ్‌వేవ్‌ను ఢీకొట్టేందుకు యంత్రాగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగు రోజులుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. 33 జిల్లాల్లో రోజుకు వందలోపు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే, కరోనా సెకండ్‌వేవ్‌ ఛాయలు పూర్తిగా కనుమరుగు కాకముందే థర్డ్‌వేవ్‌ గురించి ప్రజలు భయపడడం, ప్రభుత్వం అప్రమత్తం కావడం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు, సమృద్ధిగా మందులు, ఆక్సిజన్‌ నిల్వలున్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

ప్రయివేటు వైద్యకళాశాలలు, ఆస్పత్రులు, తాత్కాలిక ఆస్పత్రులు కూడా థర్డ్‌వేవ్‌ సేవలకు సిద్ధంగా ఉన్నాయని చెబుతోంది. మూడు నెలల్లో 45 ఏళ్లలోపు జనాభాలో 85 లక్షల మందికి, 39 లక్షల వృద్ధులకు వ్యాక్సిన్‌ వేసినట్లు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రాధాకృష్ణన్‌ తెలిపారు. ఈనెల 75 లక్షల వ్యాక్సిన్లు కేటాయించినట్లు చెప్పారు. కరోనా రోగికి, వారికి సమీపంలో ఉన్నవారికి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు చెన్నై అదనపు పోలీస్‌ కమిషనర్‌ నేతృత్వంలో ‘వార్‌రూం’ను సిద్ధం చేశారు. చెన్నై పోలీస్‌ కమిషనరేట్‌లో మూడురోజుల కరోనా పరీక్షల శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. కోయంబత్తూరులో మంగళవారం నుంచి ఆదనపు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. 

డెంగీని అడ్డుకోవాలి: మద్రాసు హైకోర్టు 
వర్షాలతో డెంగీ జ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు, పుదుచ్చేరీ ప్రభుత్వాలను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. డెంగి వ్యాప్తిని అడ్డుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సూర్యప్రకాశం అనే న్యాయవాది మద్రాసు హైకోర్టులో 2019లో పిటిషన్‌ వేశారు. ప్రధాన న్యాయమూర్తి సంజీబ్‌ బెనర్జీ, న్యాయమూర్తి ఆదికేశవులతో కూడిన బెంచ్‌కు సోమవారం విచారణకు వచ్చింది.

ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తమిళనాడు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ ఏడాది జనవరిలో 402 మంది డెంగీ బారినపడగా జూన్‌ నాటికి కేసులు 54 తగ్గాయని పేర్కొన్నారు. అలాగే చెన్నై కార్పొరేషన్‌ తన నివేదికలో ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో మొత్తం 52 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాని పేర్కొంది. చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిలో డెంగీ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కోర్టు కేసు విచారణను ముగించింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement