పాట్నా: బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రీయ జనతాదళ్ (RJD) మేనిఫెస్టోను ప్రకటించింది. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ శనివారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఆర్జేడీ సీనియర్ నేతల సమక్షంలో 'పరివర్తన్ పత్ర' (మేనిఫెస్టో) విడుదల చేసిన తేజస్వీ యాదవ్, తమ పార్టీ దేశంతోపాటు బిహార్ ప్రజలకు 24 వాగ్దానాలు చేస్తోందని చెప్పారు. ‘2024 కోసం 24 'జన్ వచన్' (ప్రజా వాగ్దానాలు) తెచ్చాం. ఈ 24 'జన్ వచన్'లు నెరవేరుస్తాం’ అన్నారు.
కేంద్రంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మెరుగైన కనెక్టివిటీ కోసం బిహార్‌లో ఐదు కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని తేజస్వి యాదవ్ చెప్పారు. పూర్నియా, భాగల్‌పూర్, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, రక్సాల్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఓపీఎస్ (పాత పెన్షన్ స్కీం)ను అమలు చేస్తామని, బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. ఏటా రక్షా బంధన్ నాడు పేదింటి మహిళలకు రూ.1 లక్ష అందిస్తామని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ అధినేత హామీ ఇచ్చారు. ‘మా భారత కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం.. ప్రస్తుతం నిరుద్యోగం మనకు పెద్ద శత్రువు. బీజేపీ వాళ్లు దీని గురించి మాట్లాడరు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ మాత్రమే ఇచ్చారు. కానీ మేము చెప్పింది చేస్తాం” అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment