సాక్షి, న్యూఢిల్లీ: ‘స్టేట్ ఫైనాన్స్‌లు: 2021–22 బడ్జెట్‌ల అధ్యయనం’పేరుతో రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నివేదిక ప్రకారం గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పుల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ కిషన్‌కపూర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 మార్చి నుంచి 2022 మార్చి వరకు తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు కాగా, ఏపీ అప్పు రూ.3,98,903 కోట్లుగా ఉందని తెలిపారు.
తమిళనాడు రూ.6,59,868 కోట్లతో మొదటిస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రాల రుణాలను ఆమోదించేటప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ద్వారా నిర్దేశించిన ఆర్థిక పరిమితులను అనుసరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సాధారణ నికర రుణ సీలింగ్(ఎన్బీసీ)ను కేంద్రం నిర్ణయిస్తుందని, క్రితం సంవత్సరాల్లో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాలను తదుపరి సంవత్సరంలోని రుణ పరిమితులలో సర్దుబాటు చేస్తారని పేర్కొన్నారు.
అయితే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీ) ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్‌ల నుంచి అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ రకమైన రుణాల ద్వారా రాష్ట్రాల ఎన్బీసీని దాటడం వల్ల కలిగే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని రుణాల లెక్కలను నిర్ణయించి రాష్ట్రాలకు తెలియచేశామన్నారు.
విచ్చలవిడి అప్పులతో రాష్ట్రం దివాలా: ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ: విచ్చలవిడి అప్పులతో తెలంగాణను దివాలా రాష్ట్రంగా మార్చేశారని కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, లక్షల కోట్లు అప్పులు చేసి ఆర్థికంగా సర్వనాశనం చేశారని దుమ్మెత్తిపోశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరువల్ల ఎనిమిదేళ్లలో తలసరి అప్పు ఐదు రెట్లు పెరిగిందని దుయ్యబట్టారు.
‘తెలంగాణ ఏర్పడే నాటికి 2014 జూన్‌లో రాష్ట్ర అప్పు రూ.69 వేల కోట్లు. అది 2018 నాటికి 1.60 లక్షల కోట్లు, 2019 నాటికి రూ.1.90 లక్షల కోట్లు, 2020 నాటికి రూ.2.25 లక్షల కోట్లు, 2021 మార్చి నాటికి రూ.2.67 లక్షల కోట్లు ఉంటే 2022 మార్చి నాటికి అప్పు రూ.3.12 లక్షల కోట్లకు చేరింది’ అని వెల్లడించారు. సహేతుకం కాని ప్రాజెక్టుల పేరిట అప్పులు చేసి, ప్రజలను తాకట్టుపెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఘాటైన విమర్శలు చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా లోక్‌సభలో రాష్ట్రాల అప్పులపై తానడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానాన్ని వివరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తలసరి అప్పు పెరిగింది..
తెలంగాణ ఏర్పడేనాటికి తలసరి అప్పు రూ.18,157గా ఉంటే అది ఇప్పుడు ఐదు రెట్లు పెరిగి రూ. 82,155కు చేరిందని ఉత్తమ్‌కుమార్ అన్నారు. వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా సేకరించిన రుణాలనూ పరిగణనలోకి తీసుకుంటే, తెలంగాణ మొత్తం అప్పులు రూ. 4 లక్షల కోట్లకు ఉన్నాయని, తలసరి అప్పు రూ.లక్షకు పైగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రుణాలను సైతం ఆదాయంగా చూపుతోందని కాగ్ చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలను, ఆర్‌బీఐని, రుణ సంస్థలను మోసం చేశారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment