సాక్షి, చెన్నై: టమాటా ధరల కట్టడికి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కిలో రూ. 79కి విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాలు, దిగుమతి తగ్గడంతో టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. రాష్ట్రంలోని మార్కెట్లలో కిలో రూ. 130 నుంచి రూ. 150 వరకు పలుకుతోంది. ధరలు మరింత పెరగొచ్చన్న సంకేతాలతో మహారాష్ట్ర నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. సహకారశాఖ పరిధిలో తోట పచ్చధనం దుకాణాల ద్వారా బుధవారం నుంచి కిలో రూ. 79కి విక్రయాలు ప్రారంభించింది.
చెన్నైలో 40, ఇతర ప్రాంతాల్లోని మరో 65 దుకాణాల్లో విక్రయాలు సాగుతున్నాయి. కొన్నిరోజులుగా దక్షిణాది రాష్ట్రాలలో కురిసిన వానలకు కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. వానలతో దిగుబడి తగ్గడమే ఇందుకు కారణం. ఇప్పటికే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలలోనూ టమాటా ధర రికార్డు స్థాయికి చేరింది. ఇక హైదరాబాద్‌లో టమాటా ధర నెల రోజుల క్రితం కిలో రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.100కు చేరింది. అటు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోనూ టమాట ధర రూ.100 దాటింది. వైఎస్సార్ కడప జిల్లాలో మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని సామాన్యులకు భారం కాకుండా టమాటను బయటి ప్రాంతం నుంచి తెప్పించింది. కడప రైతు బజార్‌లో బుధవారం కిలో ధర రూ. 65 చొప్పున విక్రయాలను చేపట్టారు.
చదవండి: పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది
Comments
Please login to add a commentAdd a comment