పుణె: లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వానికి ఏకంగా వందల కోట్ల మేర టోకరా వేసేందుకు ప్రయత్నించిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. వస్తు సేవల (జీఎస్టీ) అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
రూ.110 కోట్ల విలువైన బోగస్ ఇన్వాయిస్‌లు జారీ చేసిన పుణేకు చెందిన వ్యాపారవేత్త బాబుషా శ్రణప్ప కస్బేను మహారాష్ట్ర వస్తు సేవల అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఈనెల 25వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కస్బే రూ 16.86 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్‌ను ఎలాంటి సరుకు, సేవలను డెలివరీ చేయకుండానే గుర్తింపు పొందిన సంస్థల ఖాతాలకు మళ్లించాడు.
ఇది గుర్తించిన మహారాష్ట్ర వస్తు, సేవల చట్టం, కేంద్ర వస్తు సేవల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా అతడి కదలికలను గమనించి మంగళవారం కస్బేను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం పుణేలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment