Fake bills
-
నీలోఫర్: రికార్డుల్లో అంకెలు దిద్ది.. రూ.1.2 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి డైట్ మాజీ కాంట్రాక్టర్ కోడూరి సురేష్ బాబును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. బోగస్ బిల్లులతో రూ.1.2 కోట్లు స్వాహా చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇతడిపై కేసు నమోదైనట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. మియాపూర్‌నకు చెందిన సురేష్‌బాబు 2017 ఏప్రిల్ 1న నిలోఫర్ ఆస్పత్రి డైట్ సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్పేషేంట్లతో పాటు వైద్యులకు అవసరమైన ఆహారం సరఫరా చేయడం ఈయన బాధ్యత. 2020 జూలైతో ఈయన కాంట్రాక్టు పూర్తి కావడంతో టెండర్లు పిలిచి మరొకరికి ఈ బాధ్యతలు అప్పగించారు. 2017–18 నుంచి 2019–20 మధ్య ఆహార సరఫరాలో సురేష్ బాబు గోల్‌మాల్‌కు పాల్పడినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఆస్పత్రి వర్గాలు విచారణ కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేశాయి. వీరి పరిశీలన నేపథ్యంలోనే ఆహార సరఫరా రికార్డుల్లో అనేక అవకతవకలు ఉన్నట్లు బహిర్గతమైంది. కొన్ని చోట్ల అంకెల్ని దిద్దినట్లు గుర్తించారు. దీంతో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ గత నెలలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు మొత్తం రూ.1,13,28,320 స్వాహా చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కట్టంగూర్ శ్రీనివాస్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల పాటు రోగులు, వైద్యులకు సాధారణ ఆహారం సరఫరా చేసిన సురేష్ బాబు హై ప్రొటీన్ డైట్ ఇచ్చినట్లు రికార్డులు సృష్టించాడని తేల్చారు. దీంతో పాటు ఉన్న వైద్యులు, రోగుల కంటే ఎక్కువ మందికి ఆహారం అందించినట్లు రికార్డులు ట్యాంపర్ చేసినట్లు తేల్చారు. ఆస్పత్రి వర్గాలు గుర్తించిన మొత్తానికి మించి రూ.1.2 కోట్లు స్వాహా చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో సోమవారం సురేష్ బాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రభుత్వ కళ్లు గప్పి రూ.110 కోట్లకు టోకరా
పుణె: లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వానికి ఏకంగా వందల కోట్ల మేర టోకరా వేసేందుకు ప్రయత్నించిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. వస్తు సేవల (జీఎస్టీ) అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.110 కోట్ల విలువైన బోగస్ ఇన్వాయిస్లు జారీ చేసిన పుణేకు చెందిన వ్యాపారవేత్త బాబుషా శ్రణప్ప కస్బేను మహారాష్ట్ర వస్తు సేవల అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఈనెల 25వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కస్బే రూ 16.86 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్‌ను ఎలాంటి సరుకు, సేవలను డెలివరీ చేయకుండానే గుర్తింపు పొందిన సంస్థల ఖాతాలకు మళ్లించాడు. ఇది గుర్తించిన మహారాష్ట్ర వస్తు, సేవల చట్టం, కేంద్ర వస్తు సేవల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా అతడి కదలికలను గమనించి మంగళవారం కస్బేను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం పుణేలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
మస్తరు.. మాయాజాలం
పటమట(విజయవాడ తూర్పు): వీఐపీలు తిరుగాడే బందరురోడ్డు, ఏలూరు రోడ్డును వీఎంసీ లిట్టర్‌ఫ్రీజోన్‌గా ప్రకటించింది. ఈ రోడ్లలో వ్యర్థపదార్థాలు, చెత్త, దుమ్మును నిత్యం శుభ్రం చేయటానికి కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు షిఫ్టులవారీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో లిట్టర్ ఫ్రీ జోన్లో 150 మంది విధులు నిర్వహించేవారు. అయితే కార్మికుల సంఖ్యను 150 నుంచి 200 మందికి పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో కౌన్సిల్ తీర్మానం కూడా అయ్యింది. మార్చి నుంచి ఆగస్టు వరకు ఆరునెలలపాటు కాంట్రాక్టు నిర్వాహణను కృష్ణలంకకు చెందిన ఓ కాంట్రాక్టరు చేపట్టారు. రూ.1.75 కోట్ల కాంట్రాక్టును టెండర్ ప్రాతిపదికన కాకుండా అత్యవసర సేవలుగా నామినేడెట్ పద్ధతిలో కాంట్రాక్టు పొందారు. గతంలో కంటే 50 మంది మగ వర్కర్లను నియమించుకుని రోడ్డు–ఎండ్–టూ ఎండ్ ఊడ్చేందుకు, ఫూట్పాత్లను శుభ్రం చేసేందుకు, యూనిఫాం, పారిశుద్ధ్య పరికరాలతోపాటు, చెత్తను వేయటానికి ప్రత్యేక కవరును ఏర్పాటు చేసుకునేలా సదరు సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. అయితే మార్చి నుంచి ఇప్పటి వరకు కేవలం ప్రతినిత్యం 150 మందితోనే పనిచేయించి 200 మంది దొంగ హాజరు చూపించి, ఏప్రిల్ – మే నెలలకు సంబంధించి బిల్లుపెట్టడంతో ఆడిట్ అభ్యంతరాలతో విషయం బయటకు పొక్కింది. దీనికి వీఎంసీ ప్రజారోగ్య కీలక అధికారి కూడా సహకరించారని, హాజరును బట్టి కాంట్రాక్టు బిల్లులు చెల్లించాలని కమిషనర్ ఆదేశించినప్పటికీ ఈ విభాగం అధికారులు బేఖాతరు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. కోవిడ్ ప్రభావంతో మ్యాన్యువల్‌గా హాజరు.. గతంలో బయోమెట్రిక్ విధానంతో మస్తరు నమోదు జరిగేది. మార్చి నుంచి నగరంలో కోవిడ్–19 ప్రభావం ఉండటంతో బయోమెట్రిక్ విధానం రద్దుచేసి ఫేస్ రికగ్నైజేషన్ లేదా సంతకాలతో మ్యాన్యువల్‌గా హాజరు నమోదు చేయటం వల్ల తక్కువ మంది హాజరైనా ఎక్కువమంది అయ్యినట్లు క్షేత్రస్థాయి సిబ్బంది కాంట్రాక్టరుకు సహకరించినట్లు విమర్శలకు విన వస్తున్నాయి. దీనిపై విచారణకు ఆదేశించినప్పటికీ శనివారం సదరు కాంట్రాక్టు సంస్థ నుంచి రూ. 50 లక్షల బిల్లును ప్రజారోగ్య విభాగం నుంచి అప్రూవల్ పొంది ఆడిట్‌కు రాగా అధికారులు హాజరుపట్టీని సమర్పించాలని, షిప్టులవారీ డ్యూటీ షీట్‌ను సమర్పించాలని ఆదేశించటం వివాదాస్పదమయ్యింది. పరికరాలూ వీఎంసీవే.. ఒప్పందం ప్రకారం పారిశుద్ధ్య సిబ్బంది వినియోగించే పరికరాలు, యూనిఫాం, ఇతర యంత్రాలు కాంట్రాక్టర్లే సమకూర్చుకోవాల్సి ఉంది. అయితే కొంతమంది శానిటరీ ఇన్స్పెక్టర్లు సీఎంఈవై, డ్వాక్రా సిబ్బందిచే వీఎంసీ తయారు చేయిస్తున్న పరికరాలు, యూనిఫాం, గ్లౌజులు, బ్యాక్‌ప్యాక్‌లను ఆయా కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన తరలిస్తున్నారని, ఇందుకుగాను ఒక్కో కాంట్రాక్టర్ నుంచి నెలవారీ మామూళ్లు పొందుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. లిట్టర్ ఫ్రీ జోన్లో మ్యాన్యువల్ హాజరే.. లిట్టర్‌ఫ్రీ జోన్లో మ్యాన్యువల్‌గానే మస్తరు వేస్తున్నాం. మస్తర్ల ప్రకారమే వేతనాలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కారి్మకులకు ఏప్రిల్–మే వేతనాలకు బిల్లులు వచ్చాయి. పరిశీలన జరిగాకే చెల్లింపులకు సిఫారసు చేశాం. – వెంకటరమణ, సీఎంఓహెచ్, వీఎంసీ -
200 కోట్ల జీఎస్టీ మోసం
బనశంకరి (బెంగళూరు): నకిలీ బిల్లులు సృష్టించి సుమారు రూ.200 కోట్లకుపైగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఎగవేసిన ఆరోపణలపై విక్రమ్‌దుగ్గల్, అష్పాక్ అహ్మద్, నయాజ్ అహ్మద్ అనే ముగ్గురిని బెంగళూరు వాణిజ్య పన్నులశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నగరంలోని టీ.దాసరహళ్లి, చిక్కబాణవారలో అనేక డొల్ల కంపెనీలు నడుపుతున్న వీరు విచ్చలవిడిగా జీఎస్టీ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని పలు కీలక ఫైళ్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద జీఎస్టీ మోసంగా అధికారులు చెబుతున్నారు. రూ.203 కోట్లకు పైగా విలువైన జీఎస్టీ పన్నుల ఎగవేతకు సంబంధించిన నకిలీ బిల్లులు కూడా లభ్యమయ్యాయి. రెండేళ్ల క్రితం మృతిచెందిన వారి పేర్లతో నకిలీ బిల్లులు సృష్టించారు. -
ఆర్టీసీలో అవినీతి ని‘రంజన్లు’!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల కోసం ఏర్పాటు చేసే మంచి నీటి కుండలనూ వదల్లేదు అవినీతి అధికారులు. ఆర్టీసీ సిబ్బందికి ఎండల్లో చల్లటి నీ రు అందించేందుకు రంజన్ (భారీ నీటి కూజా)లు కొన్నామంటూ దొంగ బిల్లులు సృష్టించి నిధులు కాజేశారు. ఇక ఆర్టీసీ శిక్షణ కేంద్రాలు, బస్ డిపోలు, బస్టాండ్ల వద్ద మట్టి పోయించామంటూ మరికొందరు అధికారులు బిల్లులతో డబ్బులు స్వాహా చేశారు. కండక్టర్లు పది రూపాయల లెక్క సరిగా చూపకుంటే విధుల్లోంచి తొలగించిన దాఖలాలు ఆర్టీసీలో సాధారణం. కానీ దొంగ బిల్లులు సృష్టించి ఆర్టీసీ ఖజానాకు కన్నం పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోకపోగా, పైపెచ్చు వారికి పదోన్నతులు కల్పించేందుకు సిద్ధమైన వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఇంటి దొంగలను పట్టించిన విజిలెన్స్ ఇటీవల ఆర్టీసీ విజిలెన్స్ విభాగం కొందరు ఇంటి దొంగల గుట్టు విప్పింది. తప్పుడు బిల్లులు సృష్టించి ఆర్టీసీ ఖజా నాకు కన్నంపెట్టిన వారి వివరాలు సేకరించింది. అలా ఎంత మొత్తం వారి పరమైందో లెక్కలతో సహా బస్‌భవన్‌కు నివేదిక సమర్పించింది. కానీ అందులో పేర్లు నమోదైన అధికారులపై చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టారు. పలు జిల్లాల్లో ఈ తంతు జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో కొందరి పేర్లు డిపో మేనేజర్ల పదోన్నతుల జాబితాలో ఉం డటంతో వారి గురించి బయటకు పొక్కకుండా కొందరు ఉన్నతాధికారులు అడ్డుపడ్డారన్న ప్రచారం జరుగుతోంది. వరంగల్‌కు చెందిన ఓ అధికారి రంజన్లు కొన్నట్టు, అక్కడి ఆర్టీసీ శిక్షణ కళాశాల ప్రాంగణంలో మట్టి పోయించినట్టు బిల్లులు సృష్టించి డబ్బులు తీసుకున్నారు. దీనిపై విజిలెన్సుకు ఫిర్యాదులు వెళ్లటంతో విచారణ జరిపిన అధికారులు అవి తప్పుడు బిల్లులని, వాటిలో చూపినట్టుగా రంజన్లు కొనలేదని, మట్టి పోయించలేదని తేల్చారు. రికవరీ మొత్తాన్ని వదల్లేదు.. చిన్నచిన్న ప్రమాదాల్లో బస్సులు డ్యామేజ్ అయితే విచారణ జరిపి డ్రైవర్ల తప్పిదం ఉంటే వారి నుంచి ఆ నష్టాన్ని రికవరీ చేయటం సహజం. అలా డ్రైవర్ల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఖజానాకు జమ కట్టాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఖజానాకు జమ కట్టకుండా ఓ అధికారి స్వాహా చేశారు. కానీ ఆ అధికారిపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులు అడ్డుపడ్డారు. విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలు అసలే ఆర్టీసీ విజిలెన్సు దాదాపు నిర్వీర్యమైంది. పర్యవేక్షించే వారు లేక కేవలం కమీషన్లు దండుకోవటం మినహా చేసేదేమీ లేదంటూ ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలో జిల్లాల్లోని కొందరు అధికారులు దర్యాప్తు చేసి కేసులు నమోదు చేసి నివేదికలు సమర్పిస్తే ఉన్నతాధికారులు వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. విజిలెన్సు కేసుల్లో దొరికిన అధికారులపై చర్యలు తీసుకోకుండా పదోన్నతులు కల్పిస్తే ఇక వారు డిపోలను దివాళా తీయిస్తారని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. అస్మదీయులకు అందలం కండక్టర్ల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు.. సొంత ఖజానాకు కన్నం పెట్టే అధికారుల విషయంలో మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజన్లు, మట్టి పేర దొంగ బిల్లులతో డబ్బులు కాజేసిన వారు, అద్దె బస్సుల నిర్వాహకులతో కుమ్మక్కయిన అధికారులపై చర్యలు తీసుకోక పోగా.. అందులో కొందరికి డిపో మేనేజర్లుగా పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. గతంలో హైదరాబాద్ బస్టాండ్లలోని దుకాణాల అద్దెలు వసూలు చేసి ఖజానాకు చెల్లించకుండా సొంతానికి వాడుకున్న వారి విషయంలోనూ ఇలానే వ్యవహరించారు. రూ.కోట్లలో నిధులు స్వాహా చేసిన కేసులో తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్న విశ్రాంత ఉద్యోగులపై చర్యలు తీసుకుని, బాధ్యులైన అసలు అధికారులు వదిలిపెట్టారు. -
దొంగ బిల్లులే..!
యనమలకుదురు గ్రామ పంచాయతీలో నకిలీ బిల్లు యనమలకుదురు ‘పంచాయితీ’ అక్రమాల్లో కొత్త కోణం బిల్లులో పేర్కొన్న సంస్థ లేదని తేల్చిన డీసీటీవో పెనమలూరు : యనమలకుదురు గ్రామ పంచాయతీలో నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసినట్లు వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. పంచాయతీలో చూపిస్తున్న బిల్లుల్లో పేర్కొన్న వ్యాపార సంస్థలేమీ లేవని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ధ్రువీకరించారు. దీంతో నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసినట్లు స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు... యనమలకుదురు పంచాయతీ కార్యదర్శిగా రామకోటేశ్వరరావు 2015లో పని చేశారు. ఆ సమయంలో పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ పరికరాల కొనుగోలు, వాటర్ వర్క్స్, ఇతర పనులకు సంబంధించి నకిలీ బిల్లులు పెట్టి రూ.50లక్షలకు పైగా నిధులు డ్రా చేశారు. పంచాయతీ పాలకవర్గ ఆమోదం లేకుండానే ట్రెజరీ నుంచి కాకుండా నేరుగా ఈ నిధులు డ్రా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు.. నిధులు డ్రా చేసే విషయంలో నిబంధనలు పాటించలేదని గుర్తించి రామకోటేశ్వరరావును సస్పెండ్ చేశారు. అయితే నకిలీ బిల్లులపై మాత్రం విచారణ చేయలేదు. అక్రమంగా డ్రా చేసిన సొమ్మును రికవరీ చేయలేదు. ఈ అవనితీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు, పలువురు అధికారుల పాత్ర కూడా ఉందని, అందువల్లే కార్యదర్శి సస్పెన్షన్‌తో సరిపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. స.హ.చట్టం దరఖాస్తుతో... విజయవాడలోని భావన్నారాయణ వీధిలో డోర్ నంబర్ 45–3–44 /2ఏలో నిఖిత ఎంటర్ప్రైజెస్ పేరుతో రూ.15లక్షల విలువైన పలు రకాల మెటీరియల్ తీసుకున్నట్లు పంచాయతీలో బిల్లులు చూపించారు. ఈ బిల్లులపై ఏపీ జీఎస్టీ నంబర్ 1842 ఆర్సీ నంబర్ వీజే2/02/865 అని ఉంది. ఈ క్రమంలో పంచాయతీ లెక్కల్లో చూపిస్తున్న బిల్లులు అందించిన వ్యాపార సంస్థల వివరాలు ఇవ్వాలని యనమలకుదురు ఉప సర్పంచ్ ముప్పవరపు నారాయణరావు సమాచార హక్కు చట్టం ద్వారా వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కోరారు. దీనిపై విచారణ చేసిన విజయవాడ డీసీటీవో నిఖిత ఎంటర్ప్రైజెస్ పేరుతో అసలు తమ పరిధిలో వ్యాపార సంస్థలు లేవని ధ్రువీకరిస్తూ బదులిచ్చారు. ఉయ్యూరులో మంజునాథ ఎంటర్ ప్రైజెస్ పేరుతో కూడా రూ.10 లక్షల వరకు బిల్లులు ఉన్నాయి. అక్కడి డీసీటీవో కూడా మంజునాథ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎటువంటి వ్యాపార సంస్థ లేదని తెలిపారు. ఇదే తరహాలో మరికొన్ని సంస్థల పేరుతో బిల్లులు పెట్టి నిధులు డ్రా చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి నిధుల రికవరీకి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆర్టీసీ నకిలీ బిల్లులపై పోలీసు నజర్
♦ 9 డిపోల పరిధిలో క్రిమినల్ కేసులు నమోదు ♦ 125 మందిపై ఫిర్యాదు చేసిన డిపో మేనేజర్లు ♦ ఆర్టీసీ ప్రింటింగ్ ప్రెస్ నుంచే నకిలీ బిల్లులకు పేపర్ సరఫరా సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో నకిలీ మెడికల్ బిల్లుల వ్యవహారంపై ఇప్పటికే విజిలెన్స్ విభా గం దర్యాప్తు చేస్తుండగా తాజాగా పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికి త్సలు చేయించుకోకు న్నా ఆసుపత్రి జారీ చేసినట్టుగా బోగస్ బిల్లులు సృష్టించి వందల సంఖ్యలో సిబ్బంది సెలవులు పెట్టి జీతం పొందారు. ఓ డిపో మేనేజర్‌కు వచ్చిన చిన్న అనుమానంతో ఈ మొత్తం తతంగం వెలుగుచూసింది. కానీ ఆ తర్వాత వ్యవహారం అక్కడితో ఆగిపోయిన తరుణంలో దీన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో తెలంగాణ ఆర్టీసీ జేఎండీ రమణారావు విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా విజిలెన్స్ అధికారులు దీనిపై కూపీ లాగుతున్నారు. నకిలీ బిల్లులు ఎవరు జారీ చేశారనే కోణంలో విచారణ సాగుతోంది. తా జాగా హైదరాబాద్‌లోని తొమ్మిది డిపోల పరి ధిలో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఆయా డిపోల్లో పనిచేస్తూ నకిలీ బిల్లులతో జీతం పొందిన 125 మందిపై డిపో మేనేజర్లు ఫిర్యాదు చేశారు. మియాపూర్-1, మియాపూర్-2, కూకట్పల్లి, బీహెచ్ఈఎల్, జీడిమెట్ల, మేడ్చల్, హెచ్‌సీయూ, రాణిగంజ్-1, రాణిగంజ్-2, చెంగిచెర్ల, రాజేంద్రనగర్ డిపోల పరిధి లో నకిలీ బిల్లులు వెలుగుచూశాయి. అయితే ఇవి కేవలం డిసెంబరుకు సంబంధించినవే. అంతకుముందు ఏయే డిపోల్లో ఎంతమంది ఇలా నకిలీ బిల్లులు వినియోగించారనేది తేలా ల్సి ఉంది. ఆ సంఖ్య వేలల్లో ఉంటుందనే అనుమానాలున్నాయి. తార్నాక ఆసుపత్రిలో బిల్లులకు వినియోగించే కాగితం మియాపూర్‌లోని ఆర్టీసీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి బట్వాడా అవుతుంది. ఇప్పుడు పట్టుబడ్డ నకిలీ బిల్లులకు వాడిన కాగితం కూడా అదేనని తేలింది. దీంతో విజిలెన్స్ విచారణతోపాటు పోలీసు దర్యాప్తు కూడా అవసరమని భావించి పోలీసు స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జేఎండీ రమణారావు సంబంధిత డిపో మేనేజర్లను ఆదేశించారు. యూనియన్ నేతలపై ఒత్తిడి పోలీసు దర్యాప్తుతో ఆందోళన చెందుతున్న నిందితులు దాన్ని అడ్డుకునేందుకు యూని యన్ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికలకు నగారా మోగడంతో కోలాహలం నెలకొంది. ఓటర్ జాబితా వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ కేసుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయం కావటంతో తాము ఏం చెప్పినా యూనియన్ నేతలు చేస్తారన్న ఉద్దేశంతో నిందితులు వారిపై ఒత్తిడి ప్రారంభించారు. ఎవరినైనా పోలీసులు అరెస్టు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిపివేస్తామని యాజమాన్యాన్ని బెదిరించాలని వారు చెబుతున్నట్లు తెలిసింది. ఆర్టీసీ ఖజానాను అడ్డంగా లూటీచేసిన వ్యవహారంలో నిందితులకు అనుకూలంగా మాట్లాడే విషయంలో యూనియన్ నేతలు తటపటాయిస్తున్నారు. ఒకవేళ నింది తులకు అండగా నిలిస్తే చెడ్డపేరు మూటగట్టుకోవడమే కాకుండా ఎన్నికల్లో దెబ్బతినాల్సిన పరిస్థితి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. -
నకిలీబిల్లులతో దర్జాగా..
తవ్వినా కొద్దీ.. నల్లా బిల్లుల డబ్బు కాజేసిన వైనం ఇంటింటి సర్వేలో వెలుగులోకి ఎలక్ట్రీషియన్ లీలలు చూసి విస్తూపోయిన అధికారులు అతడు పేరుకే పార్ట్‌టైం ఉద్యోగి.. అంతా గుత్తాధిపత్యమే.. ఆ పంచాయతీలో కార్యదర్శి ఇచ్చిన అలుసును ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకున్నాడు.. కేవలం ఇంటిపన్నులకే పరిమితమనుకున్న అతడి అవినీతి లీలలు నల్లా బిల్లుల వసూళ్లలో కూడా ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలింది. నకిలీ బిల్లులు సృష్టించి నల్లా బిల్లుల పేరిట డబ్బులు వసూలు చేసి కాజేశాడని అధికారుల సర్వేలో బయటపడింది. పలివెల(మునుగోడు) పలివెల గ్రామ పంచాయతీ పార్ట్‌టైం ఎలక్ట్రీషన్ భిక్షంరెడ్డి ఇంటి పన్నుల వసూలులో చేసిన గోల్మాల్ను నిగ్గు తేల్చేందుకు మండలంలోని 10 మంది కార్యదర్శులు బృందం సోమవారం ఆ గ్రామానికి వెళ్లి ఇంటింటి సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో అతడి గోల్మాల్ పనులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతడు ఇంటి పన్నులతో పాటు నల్లా ప న్ను డబ్బులు కూడా స్వాహా చేసినట్టు తేలింది. నకలీ బిల్లులు సృష్టించి.. 2012 నుంచి ఇప్పటి వరకు అతను నకలీ నల్లా బుక్కులతో పన్నులు వసూలు చేశాడు. కార్యదర్శులు ఇంటి ఇంటికీ వెళ్లి వారి వద్ద ఉన్న రశీదులను చూస్తే డబ్బులు చెల్లించినట్టు ఉన్నాయి. కానీ అందుకు సంబంధించిన జీరాక్స్ బుక్స్ మాత్రం పంచాయతీ కార్యాలయంలో లేవు. దీంతో అవి నకిలీ బుక్స్‌గా కార్యదర్శులు గుర్తిం చారు. ఇలా వారు సర్వే చేపట్టిన ఇళ్లలో దాదపు సగానికి పైగా నకలీ రశీదులు ఉన్నట్టు తేలాయి. 300 ఇళ్లకే రూ.45వేలు.. ఆ గ్రామంలో 687 ఇళ్లు ఉన్నాయి. మొదటి రోజున కార్యదర్శుల బృందం దాదాపు 300 ఇళ్ల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించింది. అయితే ఆ ఇంటి యజమానుల వద్ద ఉన్న రశీదులను పరి శీలించగా అందులో *45వేల 976 రూపాయలను ఎలక్ట్రీషన్ గోల్మాల్ చేసినట్లు గుర్తించా రు. మిగతా 387 ఇళ్లలో సర్వే చేస్తే మరో *లక్ష వరకు అతను కాజేసి ఉంటాడని అనూమానం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఇళ్లను కూడా పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి అతను ఎంత మింగేశాడనే తేల్చి సంబంధిత లిస్టును గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డుకు అంటించాలని గ్రామస్తులు కోరుతున్నారు.