ఆర్టీసీ నకిలీ బిల్లులపై పోలీసు నజర్
♦ 9 డిపోల పరిధిలో క్రిమినల్ కేసులు నమోదు
♦ 125 మందిపై ఫిర్యాదు చేసిన డిపో మేనేజర్లు
♦ ఆర్టీసీ ప్రింటింగ్ ప్రెస్ నుంచే నకిలీ బిల్లులకు పేపర్ సరఫరా
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో నకిలీ మెడికల్ బిల్లుల వ్యవహారంపై ఇప్పటికే విజిలెన్స్ విభా గం దర్యాప్తు చేస్తుండగా తాజాగా పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికి త్సలు చేయించుకోకు న్నా ఆసుపత్రి జారీ చేసినట్టుగా బోగస్ బిల్లులు సృష్టించి వందల సంఖ్యలో సిబ్బంది సెలవులు పెట్టి జీతం పొందారు. ఓ డిపో మేనేజర్‌కు వచ్చిన చిన్న అనుమానంతో ఈ మొత్తం తతంగం వెలుగుచూసింది. కానీ ఆ తర్వాత వ్యవహారం అక్కడితో ఆగిపోయిన తరుణంలో దీన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో తెలంగాణ ఆర్టీసీ జేఎండీ రమణారావు విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
కొద్దిరోజులుగా విజిలెన్స్ అధికారులు దీనిపై కూపీ లాగుతున్నారు. నకిలీ బిల్లులు ఎవరు జారీ చేశారనే కోణంలో విచారణ సాగుతోంది. తా జాగా హైదరాబాద్‌లోని తొమ్మిది డిపోల పరి ధిలో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఆయా డిపోల్లో పనిచేస్తూ నకిలీ బిల్లులతో జీతం పొందిన 125 మందిపై డిపో మేనేజర్లు ఫిర్యాదు చేశారు. మియాపూర్-1, మియాపూర్-2, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్, జీడిమెట్ల, మేడ్చల్, హెచ్‌సీయూ, రాణిగంజ్-1, రాణిగంజ్-2, చెంగిచెర్ల, రాజేంద్రనగర్ డిపోల పరిధి లో నకిలీ బిల్లులు వెలుగుచూశాయి.
అయితే ఇవి కేవలం డిసెంబరుకు సంబంధించినవే. అంతకుముందు ఏయే డిపోల్లో ఎంతమంది ఇలా నకిలీ బిల్లులు వినియోగించారనేది తేలా ల్సి ఉంది. ఆ సంఖ్య వేలల్లో ఉంటుందనే అనుమానాలున్నాయి. తార్నాక ఆసుపత్రిలో బిల్లులకు వినియోగించే కాగితం మియాపూర్‌లోని ఆర్టీసీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి బట్వాడా అవుతుంది. ఇప్పుడు పట్టుబడ్డ నకిలీ బిల్లులకు వాడిన కాగితం కూడా అదేనని తేలింది. దీంతో విజిలెన్స్ విచారణతోపాటు పోలీసు దర్యాప్తు కూడా అవసరమని భావించి పోలీసు స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జేఎండీ రమణారావు సంబంధిత డిపో మేనేజర్లను ఆదేశించారు.
యూనియన్ నేతలపై ఒత్తిడి
పోలీసు దర్యాప్తుతో ఆందోళన చెందుతున్న నిందితులు దాన్ని అడ్డుకునేందుకు యూని యన్ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికలకు నగారా మోగడంతో కోలాహలం నెలకొంది. ఓటర్ జాబితా వెరిఫికేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో ఈ కేసుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయం కావటంతో తాము ఏం చెప్పినా యూనియన్ నేతలు చేస్తారన్న ఉద్దేశంతో నిందితులు వారిపై ఒత్తిడి ప్రారంభించారు. ఎవరినైనా పోలీసులు అరెస్టు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిపివేస్తామని యాజమాన్యాన్ని బెదిరించాలని వారు చెబుతున్నట్లు తెలిసింది. ఆర్టీసీ ఖజానాను అడ్డంగా లూటీచేసిన వ్యవహారంలో నిందితులకు అనుకూలంగా మాట్లాడే విషయంలో యూనియన్ నేతలు తటపటాయిస్తున్నారు. ఒకవేళ నింది తులకు అండగా నిలిస్తే చెడ్డపేరు మూటగట్టుకోవడమే కాకుండా ఎన్నికల్లో దెబ్బతినాల్సిన పరిస్థితి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.