
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంత భాగం కూలిపోయింది. ఆ సమయంలో 40 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే సహయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి జరిగింది. ఈ సొరంగం ఉత్తరకాశీలోని యమునోత్రి జాతీయ రహదారిపై ఉంది.
ప్రస్తుతం సొరంగంలోని శిధిలాలను తొలగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిల్క్యారాలోని నాలుగున్నర కిలోమీటర్ల పొడవున నిర్మితమవుతున్న ఈ సొరంగంలో 150 మీటర్ల భాగం కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఉత్తరకాశీ పోలీసు సూపరింటెండెంట్ అర్పణ్ యదువంశీ తమ బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎమర్జెన్సీ 108, సొరంగం నిర్మిస్తున్న నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్) ఉద్యోగులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చార్ ధామ్ రోడ్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న ఈ ఆల్-వెదర్ టన్నెల్ నిర్మాణం కారణంగా ఉత్తరకాశీ నుండి యమునోత్రి ధామ్ వరకు ప్రయాణం 26 కిలోమీటర్లమేర తగ్గనుంది.
ఇది కూడా చదవండి: నేడు ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని ఎన్నికల ర్యాలీ.. జనం హాజరుపై సందేహాలు?
Comments
Please login to add a commentAdd a comment