డెహ్రాడూన్: పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో భూములు కొనాలనుకుంటున్నారా. అయితే ఇక అది కుదరకపోవచ్చు. రాష్ట్రంలోని గ్రామీణ కొండ ప్రాంతాల్లో రాష్ట్రం బయటివారు భూములు కొనకుండా సీఎం పుష్కర్ సింగ్ దామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలో ఒక చట్టం తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇదే తరహాలో చట్టం తీసుకువచ్చిన మరో పర్యాటక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ స్ఫూర్తిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఉత్తరాఖండ్ గ్రామీణ కొండ ప్రాంతాల్లో భూముల కొనుగోలుపై పరిమితులు విధించే విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రం బయటివారు పూర్తిగా భూములు కొనుగోలు చేయకుండా నిరోధించడం, పట్టణ ప్రాంతాల్లో భూముల కొనుగోలుపై పరిమితులు విధించాలని కమిటీ తన నివేదికలో సిఫారసు చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
బయటివారు భూములు కొనుగోలు చేయడంపై స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతోనే ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చేందుకు నిర్ణయించిందని తెలుస్తోంది. అయితే భూ చట్టాల్లో మార్పులు చేయడం ఉత్తరాఖండ్‌లో ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలో భూముల కొనుగోలుపై ఆంక్షలు విధించడం పెట్టుబడుల పేరు చెప్పి మళ్లీ వాటిని ఎత్తివేయడం చేస్తూనే వస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment