సాక్షి, న్యూఢిల్లీ : అస్సాం రాష్ట్రంలో పెద్దగా ప్రజలకు తెలియని లయికా, డోధియా అనే రెండు గ్రామాలు ఉన్నాయి. ఈ రెండు గ్రామాల్లో ఆడ, మగ, పిల్లా, పెద్ద కలిపి మొత్తం మూడు వేల మంది జనాభా ఉన్నారు. ఆ ఊర్లకు రోడ్లు లేవు. మెడికల్ షాపులు, రేషన్ షాపులు లేవు. బావులు లేవు. నల్లాలు లేవు. కరెంటు కూడా లేకపోవడంతో చీకటి పడితే వారికంతా అంధకారమే. రేషన్ బియ్యంగానీ, రేషన్ సరకులు గానీ వారికి అందడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ వారికి వర్తించడం లేదు. వారంతా ఓ తెగకు చెందిన వారు. ప్రభుత్వాల దష్టిలో వారి తెగ ఎప్పుడో గల్లంతయింది. కనుక వారు లేనే లేరు.
లయికా, డోధియా అటవీ గ్రామాలు. అవి దిప్రూ–సైకోవా జాతీయ పార్కు పరిధిలో ఉన్నాయి. ఆ పార్కు పరిధిలో ఎలాంటి మానవ నివాసాలు ఉండకూడదని 1972లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వైల్డ్ లైవ్ ప్రొటెక్షన్ యాక్ట్’ స్పష్టం చేస్తోంది. అందుకని ఈ రెండు గ్రామాల ప్రజలకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేయడం లేదు. అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. అలా చేస్తే ప్రభుత్వాలే చట్టాలను ఉల్లంఘించినట్లవుతుంది. మరి ఆ రెండు గ్రామాల ప్రజలను అడవుల నుంచి బయటకు పంపించి, వారికి పునరావాసం కల్పించవచ్చుగదా!
అది నిజమే! ఎవరు కల్పించాలి? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా లేదా అటవీ శాఖనా? జాతీయ పార్కులు కేంద్రం పరిధిలోకి వస్తాయి. పార్కు నిర్వాసితులను రాష్ట్రాలు పట్టించుకోవాలన్నది కొన్ని పార్కుల విషయంలో కేంద్రం గతంలో చేసిన వాదన. వన్య ప్రాణుల సంరక్షణను చూసుకోవాల్సిన బాధ్యత అటవి శాఖది కనుక, అటవి శాఖకు చెందిన మైదాన ప్రాంతాల్లో అటవి మానవ జాతులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత వారిదేననే వాదన కూడా లేకపోలేదు.
1950 దశకంలో, ఓ విపత్కర పరిస్థితులో ఈ రెండు గ్రామాలు ఆవర్భంచాయి. నాడు రిక్టర్ స్కేలుపై 8.5 పాయింట్ల తీవ్రతతో భూకంపం రావడంతో భూ ప్రళయం సంభవించి అస్సాం భౌగోళిక రూపు రేఖలే మారిపోయాయి. బ్రహ్మపుత్ర, దాని ఉప నదులు పొంగి పొర్లి అనేక గ్రామాలను కబళించాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా దిబ్రూగఢ్, దేమాజీ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతంలోని నిర్వాసితులకు దిబ్రూ–సైకోవా అటవి ప్రాంతంలో పునరావాసం కల్పించారు. అలా లయికా, డోధియా గ్రామాలు ఆవిర్భవించాయి.
అప్పుడు ఆ గ్రామాల ప్రజలను అపార చేపలు, పశువుల సంపదతోపాటు చెట్ల సంపద కూడా ఆదుకుంది. 1999 వరకు వారి జీవితాలు అలా సుఖంగా గడచిపోయాయి.
1999లో జాతీయ పార్కుతో కష్టాలు
దిబ్రూ, సైకోవా ప్రాంతాలను కలపి 1986లో ‘దిబ్రూ–సైకోవా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’గా ప్రకటించారు. దాన్ని 1999లో జాతీయ పార్కుగా ‘అప్‌గ్రేడ్’ చేయడంతో రెండు గ్రామాల ప్రజల బతుకులు ‘డీగ్రేడ్’ అయ్యాయి. 1972 నాటి వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద జాతీయ పార్కుల్లో మానవ నివాసాలు ఉండడానికి వీల్లేదు. అలా ఉన్న పక్షంలో వారిని ఖాళీ చేయించాలి. అందుకు ప్రజలు నష్టపరిహారం డిమాండ్ చేయవచ్చు. ప్రజలు కోరినంత నష్టపరిహారం చెల్లించేందుకు ఏ ప్రభుత్వాలు ముందుకు రావు కనక చరిత్రలో బలవంతపు తరలింపులే జరిగాయి. జరగుతున్నాయి.
ఇంతవరకు లయికా, డోధియా గ్రామాలను ఖాళీ చేయమని ప్రభుత్వాలు కోరలేదు. వారు నష్ట పరిహారం కోర లేదు. అస్సాం అటవీ శాఖ కూడా వారిని పట్టించుకోలేదు. అడవిలో అలా బతకడం ఆ రెండు గ్రామాల ప్రజలకు దుర్భరమవడంతో ఇప్పుడు వారంతా ‘సంయుక్త పునరావాస డిమాండ్ కమిటీ’ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి మింతురాజ్ మొరాంగ్ నాయకత్వం వహిస్తున్నారు.
ఆయన ఒకప్పుడు విద్యార్థి నాయకులు. ఆయన నాయకత్వంలో ఆ రెండు గ్రామాల ప్రజలు ఎత్తైన మైడాన ప్రాంతంలోకి వచ్చి కొన్ని రోజులుగా టిన్‌సుకియా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రి సోనోవాల్ బుధవారం నాడు ఈ గ్రామాల ప్రజల ప్రతినిధుల బందంతో చర్చలు జరిపారు. పది మంది సభ్యులతో ఓ అధికార కమిటీని వేశారు. జనవరి 31వ తేదీ నాటికల్లా సమగ్ర నివేదికను ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment