సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో రెండు రోజుల కిందట కొండ చరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ భయంకర ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఇద్దరు వ్యక్తులు రక్తమోడుతూ.. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ మరీ అక్కడి భయంకర పరిస్థితిని వివరిస్తున్న ఓ వీడియో యూట్యూబ్‌లో మంగళవారం కనిపించింది. దాదాపు ఐదు నిమిషాల నిడివిగల ఈ వీడియోను మొబైల్ ఫోన్‌తో తీశారు. తలకు తీవ్ర గాయమైన ఓ వ్యక్తి తనను తాను నవీన్‌గా పేర్కొంటూ.. అక్కడ ఏం జరిగిందో వివరిస్తున్నాడు.
నవీన్ వీడియోలో ఓ ప్రదేశాన్ని చూపతూ.. ‘‘10 నిమిషాల క్రితం మా కారు అక్కడ ఉంది. కొండ చరియలు విరిగి పడటంతో అది బోర్లా పడింది. నేను ముందు సీటులో కూర్చోని ఉన్నారు. ఎలాగోలా బయటకు రాగలిగాను. ఈ క్రమంలో నా తలకు దెబ్బ తగిలి.. రక్తం వస్తుంది. ఇవి ప్రమాదకరమైన గాయాలా.. కావా అన్నది తెలియదు’’ అన్నాడు. ఆ తర్వాత నవీన్ తాను మొదట కారు పార్క్ చేసిన చోటును చూపించాడు. ప్రస్తుతం అక్కడ పెద్ద బండరాళ్లు, విరిగిపడిన కొమ్మలు, కంకర వంటి శిథిలాలు మాత్రమే ఉండగా.. వాహనం కనిపించలేదు.
నవీన్ మాట్లాడుతూ.. ‘‘రాళ్లు దూసుకొస్తుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఓ చెట్టు కిందకు పరిగెత్తుతున్నాను.. నా స్నేహితుడు, ఓ మహిళ సహ మరో ఇద్దరు అక్కడే ఉన్నారు’’ అని చెప్తూ.. ‘ఉండండి ... అక్కడే ఉండండి, కదలకండి.. నేను వస్తున్నాను’ అని అరవడం వీడియోలో వినవచ్చు. సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేయగా.. కనెక్ట్ కాలేదు అని తెలిపాడు. ‘చూడండి, చూడండి ... మరిన్ని రాళ్లు దూసుకొస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి’ అంటూ వీడియోలో అరుపులు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడి మరో వ్యక్తి కొండపైకి ఎక్కడం వీడియోలో కనిపిస్తోంది. ముఖంపై గాయం నుంచి రక్త కారుతుండగా.. దానికి రుమాలు చుట్టాడు. పక్కనే ఒక మహిళ మృతదేహం పడి ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. కిన్నౌర్ జిల్లా సంగ్లా-చిత్ కుల్ రోడ్డు వద్ద ఆదివారం కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటనలో 9 మంది మరణించారు. మృతుల్లో రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన దీపా శర్మ(34) అనే వైద్యురాలు కూడా ఉన్నారు. చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment