సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. షాను ఆయన నివాసంలో మంగళవారం రాత్రి కలిసిన విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. అంతేకాక.. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వందలాదిమంది కృషి ఫలితమే ఆస్కార్
ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల వల్ల ఆస్కార్ సాధ్యం కాలేదని.. వందలాదిమంది టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, సినిమాకు పనిచేసిన వారి వల్లే సాధ్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. మన దేశం నుంచి రెండు ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న సందర్భంగా వారిని మంగళవారం రాజ్యసభలో ఆయన అభినందించారు.
ఆస్కార్ వచ్చిన వారికి అందించే ప్రశంసలు సందర్భానుసారంగా సినిమాకు లేదా డాక్యుమెంటరీకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ చెందాలన్నారు. భాషతో సంబంధం లేకుండా, కులమతాలకు అతీతంగా కళాకారులు ప్రతిచోటా ఉన్నారు కాబట్టి.. ఈ ప్రాంతీయ భావాలు లేదా ఉపప్రాంతీయ భావాలు లేదా భాషా భావాలు అభినందించేటప్పుడు ఉండరాదని ఆయన సూచించారు.
తెలుగువారికి గుర్తింపు: జి.వి.ఎల్
‘నాటు నాటు‘ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం తెలుగువారికి, తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు అని ఎంపీ జి.వి.ఎల్.నరసింహారావు అభివర్ణించారు. ఆయన మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ ఆస్కార్ అవార్డులు భారతీయ సినిమాకు.. ముఖ్యంగా తెలుగువారికి ఒక చారిత్రాత్మక గుర్తింపని పేర్కొన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం వాస్తవానికి తెలుగు చిత్రమని, ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు‘ పాట తెలుగుపాట అని రాజ్యసభ సభ్యులందరికీ గుర్తుచేశారు. ఆస్కార్ గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్ టీంను ఎంపీలు కె.కేశవరావు, జయాబచ్చన్, సుధాంశు త్రివేది, మనోజ్‌కుమార్ ఝా సహా పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment