తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ వచ్చిందంటే యావత్ భారతదేశం పొంగిపోయింది. కానీ కొందరు మాత్రం ఆస్కార్ క్యాంపెయిన్ కోసం కోట్లు గుమ్మరించారు, అవార్డును కొన్నారంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు విమర్శలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై రాజమౌళి తనయుడు, ఆర్‌ఆర్‌ఆర్ లైన్ ప్రొడ్యూసర్ ఎస్‌ఎస్ కార్తికేయ క్లారిటీ ఇచ్చాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై విదేశీయులు మక్కువ చూపించారు. అందుకే ఓటీటీలోకి వచ్చినప్పటికీ అమెరికాలో రిలీజ్ చేయాలనుకున్నాం. కేవలం ఒక రోజు 60 స్క్రీన్లలో ప్రదర్శిద్దామనుకున్నాం. ఒక రోజు కోసం అనుకుంటే నెల రోజులు గడిచిపోయింది. సినిమా చూశాక అందులో మీకు ఏం నచ్చింది? అని అక్కడి ప్రేక్షకులను అడిగాం. చరణ్‌ను తారక్ అన్న ఎత్తుకుని ఫైట్ చేసిన సన్నివేశం తెగ నచ్చిందన్నారు. పాటలు వస్తుంటే కూడా లేచి డ్యాన్స్ చేస్తున్నారు.
వారికి మాత్రమే ఆహ్వానం
కీరవాణి, చంద్రబోస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రేమ్‌రక్షిత్, కాలభైరవలకు అకాడమీ ఆహ్వానం పంపింది. నామినీలకు, స్టేజీపై పర్ఫామ్ చేసేవాళ్లకు అకాడమీ కమిటీ ఆహ్వానిస్తుంది. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందాలు టికెట్ కొనాల్సిందే! ఇందుకోసం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు కమిటీకి ఈమెయిల్ పంపుతారు. కీరవాణి, చంద్రబోస్ మాకోసం ఈమెయిల్ చేశారు. వాళ్లు అది చూసిన తర్వాత లింక్ పంపుతారు. దాని ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఆ టికెట్‌లలో కూడా రకరకాల క్లాసులుంటాయి. లోయర్ లెవల్ సీట్ల కోసం ఒక్కొక్కటి 1500 డాలర్లు పెట్టి కొన్నాం.
ఒక్కో టికెట్‌కు ఎంతంటే?
టాప్‌లో కూర్చుని చూసేందుకు మా కుటుంబంలోని నలుగురికి 750 డాలర్లు పెట్టి టికెట్లు తీసుకున్నాం. ఆస్కార్ కొనడమనేది పెద్ద జోక్. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇన్‌స్టిట్యూషన్ అది. అక్కడ ప్రతిదానికీ ఓ పద్ధతి ఉంటుంది. అయినా ఆడియన్స్ ప్రేమను కొనగలమా? స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్ మాటలను కొనలేం కదా.. హాలీవుడ్ సినిమాలు ప్రచారం కోసం స్టూడియోలను ఆశ్రయిస్తాయి. కానీ మాకు అలాంటి ఆస్కారం లేదు. ప్రచారం కోసం రూ.5 కోట్లు బడ్జెట్ అనుకున్నాం. మొదటి ఫేజ్‌లో రూ.3 కోట్లు ఖర్చయ్యాయి. నామినేషన్స్ అయ్యాక ఆ సెకండ్ ఫేజ్‌లో మరికొంత బడ్జెట్ పెంచాం. మొత్తంగా రూ.8.5 కోట్లు ఖర్చయింది' అని చెప్పుకొచ్చాడు కార్తికేయ.
Comments
Please login to add a commentAdd a comment