సాక్షి, న్యూఢిల్లీ: ఉక్కు వంటి ప్రభుత్వరంగ సంస్థలను సాధ్యమైతే ప్రైవేటీకరించడం, కుదరని పక్షంలో వాటిని శాశ్వతంగా మూసివేయడం నూతన పబ్లిక్ సెక్టర్ విధానమని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
విశాఖ ఉక్కులో వందశాతం వాటాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జనవరి 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో వాటాల ఉపసంహణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి లేఖలో వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేస్తూ ఈ అంశంపై తమ నిర్ణయంలో మార్పులేదని స్పష్టంచేసినట్లు తెలిపారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ.1,750 కోట్లను కేంద్రం విడుదల చేసిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఇందులో 2016–17 నుంచి 2020–21 వరకు ఐదేళ్లలో రూ.1,050 కోట్లు విడుదలయ్యాయని టీడీపీ సభ్యుడు కనకమేడల ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment