సాక్షి, హైదరాబాద్: విటమిన్ ‘డీ’.. ఎముకల ఎదుగుదల, కండరాల పటుత్వానికి అత్యంత కీలకం. రోగనిరోధక శక్తి పెంపుదలకు ఇది దోహదపడుతుంది. ఈ కారణంగానే కరోనా పరిస్థితుల్లో డీ విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, సప్లిమెంట్లు తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. కానీ దేశంలో పదేళ్ల నుంచి పంతొమ్మిదేళ్ల మధ్య వయసున్న పిల్లలు అంటే ఎదిగే పిల్లలు చాలామందిలో ఈ విటమిన్ లోపం తీవ్రంగా ఉంది. మానసిక, శారీరక ఎదుగుదలకు కీలకమైన వయసులో డీ విటమిన్ లోపం పిల్లల్లో ఎన్నోరకాల దుష్ప్రభావాలను కలిగిస్తోంది. దేశంలో 19 ఏళ్లలోపు పిల్లల్లో విటమిన్ డీ స్థితిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యూనిసెఫ్ సహకారంతో పరిశీలన చేపట్టింది. పరిశీలనలో తేలిన అంశాలతో నివేదికను తాజాగా పార్లమెంటుకు సమర్పించింది.
ఏ వయస్సు వారిలో ఎంత?
జాతీయ స్థాయిలో 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో 23.9 శాతం మంది, అంటే దాదాపుగా ప్రతి నలుగురిలో ఒకరు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారు. ఇక నాలుగేళ్లలోపు చిన్నారులు 13.8% మందిలో ఈ విటమిన్ లోపం గుర్తించగా, 18.2% మంది 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో కూడా డీ లోపం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ డీ లోపం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
చదవండి: విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..!
15 నిమిషాలు ఎండలో ఉండాలి
శరీరానికి సరిపడా విటమిన్ డీ సూర్యరశ్మి నుంచే సహజంగా వస్తుంది. మనం తినే ఆహార పదార్థాల్లోని కాల్షియంను కండరాలు, ఎముకలకు అందించడంలో ‘డీ’పాత్ర అత్యంత కీలకం. రోజుకు కనీసం పదిహేను నిమిషాలైనా ఎండలో ఉంటే విటమిన్ ‘డీ’సమతుల్యత ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది లోపిస్తే చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి వస్తుంది. ఇక పెద్దల్లో ఎముకల అరుగుదల వేగంగా ఉంటుంది. దీని ప్రభావంతో కీళ్ల నొప్పులు వస్తాయి. దీంతో పాటు నిద్రలేమి, అలసత్వం, డిప్రెషన్, ఒంటినొప్పులు వరుసగా వస్తుంటాయి. ఈ లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితే విటమిన్ల అసమతుల్యత, అధిక బరువు, రోగనిరోధక శక్తి క్షీణత లాంటివి ఉత్పన్నమవుతాయి. మారుతున్న జీవనశైలి కూడా విటమిన్ల అసమతుల్యతకు దారితీస్తోంది.
చదవండి: Belly Fat: క్యారెట్, మెంతులు, జామ, బెర్రీస్.. కొవ్వు, బరువు రెండూ తగ్గుతాయి!
తెలంగాణలో కాస్త మెరుగే
తెలంగాణలో మాత్రం విటమిన్ డీ స్థాయి కాస్త సంతృప్తికరంగానే ఉంది. నాలుగేళ్లలోపు చిన్నారులు 9.6 శాతం మందిలో, 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 5.5 శాతం మందిలో, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 8.8 శాతం మందిలో మాత్రమే లోపం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ‘డీ’లోపం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో జమ్మూ కశ్మీర్, మణిపూర్, హరియాణ, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాలున్నాయి. తమిళనాడులో ఈ లోపం అతితక్కువగా ఉంది.
చదవండి: Weight Loss Tips: బాదం, చేపలు, చెర్రీలు తరచుగా తింటే!
వైద్యుల సలహా మేరకే ‘రెడీమేడ్’ తీసుకోవాలి
సూర్యరశ్మి ఎక్కువగా సోకకపోవడం డీ విటమిన్ లోపానికి కారణమని చెప్పొచ్చు. ఇక సరైన ఆహార పదార్థాలను సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల కూడా విటమిన్ల సమస్య తలెత్తుతుంది. సముద్రపు ఆహారంలో ‘డీ’పుష్కలంగా ఉంటుంది. ప్రస్తుతం కొన్ని రకాల పోషకాహారాలకు కూడా ‘డీ’ని అదనంగా జతచేసి అందిస్తున్నారు. ఇవి రెడీమేడ్‌గా లభిస్తున్నా తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.
– డాక్టర్ కీర్తి మునగపాటి, కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్
Comments
Please login to add a commentAdd a comment