Parlament Updates: పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా  | Winter Parliament Sessions 2023 Updates | Sakshi
Sakshi News home page

Parlament Updates: పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా

Published Fri, Dec 15 2023 7:18 AM | Last Updated on Fri, Dec 15 2023 3:35 PM

Winter Parliament Sessions 2023 Updates - Sakshi

అప్‌డేట్స్..

►  విపక్షాల నిరసనలు, ఆందోళనల నడుమ పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తిరిగి ఉభయ సభలు సోమవారం ప్రారంభం కానున్నాయి.  

► పార్లమెంట్ భద్రత వైఫల్యానికి నిరసనగా విపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. పార్లమెంట్‌లో ప్రశ్నిస్తున్న ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడంపై పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ధర్నాకు దిగారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇండియా కూటమి ఎంపీలంతా ఒక్కటైనట్లు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తెలిపారు. తామంతా రాజ్యాంగేతర విధానంతో సస్పెన్షన్‌కు గురైనట్లు ఆరోపించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్న ఆయన.. ఆందోళనను కొనసాగిస్తామని అన్నారు.   

సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. వారిని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ కలిశారు. పార్లమెంట్ అలజడి అంశంలో మొత్తంగా 14 మంది ఎంపీలు సభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.  

పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో మధ్యాహ్నం 2 వరకు స్పీకర్ సభను వాయిదా వేశారు.

పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. స్పీకర్ ఇచ్చిన భద్రతా నియమాలనే ప్రభుత్వం పాటించింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది. ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పార్లమెంట్‌కు హాజరయ్యారు. 

ఇండియా కూటమికి చెందిన రాజ్యసభ ఎంపీలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. సభలో నేడు అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు.

పార్లమెంట్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై గురువారం ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ప్రతిపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం జరిగిన అవాంఛనీయ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో తీవ్ర అలజడి సృష్టించారు. వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని పట్టుబట్టారు. అరుపులు, కేకలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. తీవ్ర గందరగోళం నెలకొంది. ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లోక్‌సభ నుంచి 13 మంది విపక్ష ఎంపీలపై, రాజ్యసభలో ఒక ప్రతిపక్ష ఎంపీపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్‌ మొత్తం వారు సభకు హాజరు కాకూడదని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ స్పష్టం చేశారు.  

లోక్‌సభ గురువారం ఉద యం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రా రంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్‌ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ చెప్పారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు శాంతించలేదు. దీంతో సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న ఐదుగురు విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు.

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశాయి. ఈ రోజు మిగతా కార్యకలాపాలను పక్కనపెట్టి, కేవలం భద్రతా వైఫల్యంపైనే సభలో చర్చ చేపట్టాలని పలువురు ఎంపీలు గురువారం ఉదయం 28 నోటీసులు ఇచ్చారు. వీటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి: Parliament Attack: జాతికి జవాబు కావాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement