
బెంగళూరు: సాధారణంగా అభిమానులు.. తన మనస్సుకు నచ్చిన నాయకులు కనిపించగానే తన ప్రేమను ఒక్కొరకంగా వ్యక్తపరుస్తారు. కొందరు తమ నాయకుడికి పూలమాల వేస్తే.. మరికొందరు శాలువాలతో సత్కరించడం, ప్రేమతో ఆలింగనం చేసుకోవడం మనకు తెలిసిందే. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై గుట్టహళ్లిలో జనసేవక్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఆ ప్రాంతమంతా, పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలతో నిండి ఉంది. బొమ్మైచుట్టు వందల మంది కార్యకర్తలు, ప్రజలు గుమిగూడి ఉన్నారు.
ఈ క్రమంలో ఒక మహిళ.. బసవరాజ బొమ్మై చేతిని పట్టుకుని అభిమానంతో ముద్దులు పెట్టడం మొదలు పెట్టింది. ఈ సంఘటనతో సీఎం బొమ్మై ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అంతేకాకుండా సదరు మహిళ.. సీఎం చేతిని తన ముఖంపై ఉంచి ఆయన దీవెనలు తీసుకుంది. ఆమె చర్యలపై పక్కనే ఉన్న మంత్రి అశత్థనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.