ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: గోప్య, వ్యక్తి గతమైన సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న టీనేజర్లకు ఈ సైట్స్ వినియోగం ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో తెలిపే ఘటన ఇది. తెలిసో తెలియకో, సరదాకోసమో చేసే పిచ్చి పనులు ఒక్కోసారి ప్రాణాలు మీదికి తీసుకొస్తాయి. ఇలాంటి పొరపాటు పనే ఒక యువతి ప్రాణం తీసింది. తన కాబోయే భర్తకు తనకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను పంపాలనుకుంది. కానీ కాస్తా వికటించి చివరికి ప్రాణాలే పోగొట్టుకుంది. మధ్యప్రదేశ్, ఉజ్జయిని పరిధిలోని తోబ్రిఖేడా గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
వివరాలను పరిశీలిస్తే.. తోబ్రిఖేడాకు చెందిన యువతికి 15 రోజుల క్రితం ఇండోర్‌కు చెందిన ఒక యువకుడితో నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్తతో సరదాగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో ఏమైందో తెలియదుగానీ స్నానం చేస్తున్న వీడియోను భర్తకు పంపాలనుకుంది. అనుకున్నట్టుగా వీడియోను తీసుకుంది. కానీ ఇక్కడే దారుణం జరిగిపోయింది. వాట్సాప్ ద్వారా తన కాబోయే భర్తకు పంపాల్సిన వీడియోను, పొరపాటున తన మరో ఫ్రెండ్‌కి పంపేసింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడానికి బదులుగా మిగిలిన వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. అంతే అది క్షణాల్లో వైరల్ అయింది.
చివరికి ఈ విషయం బాధిత యువతి తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు తెలియడంతో తీవ్రంగా మందలించారు. దీంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే మార్గం తోచక, పరువు పోతుందనే భయంతో ఆమె విషం తాగేసింది. వెంటనే ఆమెను స్థానికంగా ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆ యువతి మరణించింది. దీంతో త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన తమ బిడ్డ శ్మశానానికి తరలి పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంలో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment