ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా ఒడిశా రాష్ట్రం మయూర్‌భంజ్ జిల్లా కుసుమి తెహశీల్ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లో (పహాడ్‌పూర్, ఉపర్‌బేడా) కేన్సర్ స్క్రీనింగ్, సికిల్‌సెల్ అనీమియా నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ప్రకటించింది. గ్లోబల్ గ్రేస్ హెల్త్ (జీజీహెచ్) సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం చేపట్టామని, ఎస్‌ఎల్‌ఎస్ ట్రస్ట్, సికిల్ సెల్‌కు సంబంధించిన పరికరాలను తయారు చేసే సంస్థ కూడా తన వంతు సహకారం అందించిందని గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ తెలిపింది.
ఈ ఉచిత పరీక్షలు ఫిబ్రవరి ఇరవయ్యవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకూ కొనసాగుతాయని, మారుమూల ప్రాంతాల్లోని వారికీ ఆధునిక వైద్య పరీక్షలను అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్యం ఈ విధంగా నెరవేరుతోందని వారు వివరించారు. పహాడ్‌పూర్ గ్రామం పరిసరాల్లోని ఐదు కిలోమీటర్ల పరిధిలో సుమారు 5800 మంది జనావాసమున్న పదకొండు గ్రామాలున్నట్టు ఫౌండేషన్ తెలిపింది. కేన్సర్‌పై పోరుకు ముందస్తు నిర్దారణ చాలా కీలకమని ఫౌండేషన్ విశ్వసిస్తోందని, అట్టడుగు వర్గాల ప్రజలకు ఆరోగ్య సేవలను విస్తరించాలన్న ఆశయంతో తాము పనిచేస్తున్నామని వివరించింది.
గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందడం కష్టమవుతున్న పరిస్థితుల్లో ఇతర సంస్థల సహకారంతో తాము చేపట్టిన ఈ కార్యక్రమం కేన్సర్, సికిల్‌సెల్ అనీమియా పరీక్షల్లోని వివక్షను తొలగించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ రెండు వ్యాధులను ఎంత తొందరగా గుర్తిస్తే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయని గుర్తు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా వ్యాధుల ముందుగానే గుర్తించడం ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చునని గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ సుంకవల్లి చిన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్‌ఎల్‌ఎస్ ట్రస్ట్ సికిల్‌సెల్ అనీమియా ఎక్విప్‌మెంట్ కంపెనీ, ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశం లభించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన... కేన్సర్, సికిల్ సెల్ అనీమియా పరీక్షలను అందరికి మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సామాజిక, భౌగోళిక అంతరాలను దాటుకుని అందరికీ ఈ పరీక్షలు అందేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. ఉచిత స్క్రీనింగ్ పరీక్షల కార్యక్రమం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ కేన్సర్‌పై అవగాహన పెరుగుతుందని, తద్వారా తమ ఆరోగ్య ప్రాథమ్యాలను నిర్ణయించుకునే సాధికారత వారికి లభిస్తుందని డాక్టర్ సుంకవల్లి చిన్నబాబు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment