World Cancer Day 2022: క్యాన్సర్‌ను జయించాలంటే మూడు కావాలి. మొదటిది ఆత్మవిశ్వాసం. రెండు కుటుంబం, స్నేహితుల సపోర్ట్. మూడు వైద్యం. వైద్యం ఎలాగూ మేలు చేస్తుంది. కాని కూడగట్టుకోవాల్సింది మొదటి రెంటినే. బాలీవుడ్‌లో నటీమణులు చాలామంది క్యాన్సర్‌ను ఎదుర్కొన్నారు. గెలిచారు. గ్లామర్ ఫీల్డ్ అయినా దాచకుండా తమ పోరాటాన్ని తెలియచేశారు. వైద్యం చాలా ఆధునికం అయ్యింది. భయం లేదు. గెలుపు ఉంది. క్యాన్సర్‌పై పోరాడాలి. గెలవాలి.
‘మనం అస్సలు ఊహించని విషయాలతో జీవితం మన మీద ఒక మలుపును విసురుతుంది’ అని నటి సోనాలి బెంద్రె 2018లో ట్విటర్‌లో రాసింది. అప్పటికే ఆమెకు ‘హైగ్రేడ్ క్యాన్సర్’ బయటపడింది. ‘ఏదో కొంత నొప్పి, ఇబ్బంది ఉండేసరికి పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్ బయటపడింది. వెంటనే నా కుటుంబం, మిత్రులు బిలబిలమంటూ నా పక్కన చేరారు నాకు సపోర్ట్ ఇవ్వడానికి. డాక్టర్లు వెంటనే వైద్యం మొదలెడదామన్నారు. న్యూయార్క్‌లో నాకు చికిత్స మొదలైంది. నేను ఇప్పుడు క్యాన్సర్‌ను ఎదుర్కొంటున్నాను’ అని రాసిందామె.
క్యాన్సర్‌కు ఇవాళ ఆధునిక జీవితానికి పట్టిన మహా భూతంలా మారింది. ఒకప్పుడు దానికి ఎటువంటి వైద్య విధానాలు లేవని వైద్యం చెప్పేది. ఇప్పుడు ఎటువంటి మొండి క్యాన్సర్‌ను అయినా ఎదుర్కొనే ఆధునిక పద్దతులు వచ్చాయి. క్యాన్సర్ బారిన పడినవారు ఆ ఆధునిక పద్ధతులు వాడుకునేందుకు వీలుగా ధైర్యంగా ఉండటమే కావాల్సింది. కుంగిపోకపోతే అదే సగం బలం. బలమే పోరాటం. ఆరోగ్యం.
రెండేళ్లు క్యాన్సర్‌కు వైద్యం తీసుకున్నాక సోనాలి బెంద్రే స్వస్థత పొందింది. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతోంది. హైగ్రేడ్ క్యాన్సర్‌ను ఆమె జయించగా లేనిది మిగిలిన వారు కూడా ఎందుకు జయించలేరు? ఆమెలాగే అందరూ మామూలు మనుషులే. ఆమె వృత్తిరీత్యా నటి మాత్రమే. తేడా ఏమిటంటే ఆమె పోరాడాలని నిశ్చయించుకుంది.
2021 ఏప్రిల్‌లో నటి కిరణ్ ఖేర్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. కాని ఆమె భయపడలేదు. క్యాన్సర్‌ను ఎదుర్కొనడానికి ట్రీట్‌మెంట్‌కు సహకరించాలనుకుంది. భర్త అనుపమ్ ఖేర్ ‘ఆమెకు ఏమీ కాదు. ఆమె ఆరోగ్యం పొందుతుంది’ అని ధైర్యం చెప్పాడు. ముంబైలో కిరణ్ ఖేర్‌కు వైద్యం జరిగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఆమె తాను పాల్గొంటున్న ఒక టీవీ షోలో జడ్జ్‌గా తిరిగి వచ్చి కూచుని క్యాన్సర్ దారి క్యాన్సర్‌దే మన పని మన పనే అన్నట్టుగా స్ఫూర్తినిస్తోంది.
మరో సీనియర్ నటి నఫీసా అలీ కూడా చర్మ సంబంధ క్యాన్సర్ బారిన పడ్డారు. అయినప్పటికీ ఆమె కుంగిపోక పోరాడింది. కీమో థెరపీ తీసుకుని ఆమె క్యాన్సర్‌ను జయించింది. కీమో థెరపీ చేయించుకుంటూ నవ్వుతూ ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పెట్టింది. అలాగే శిరోజాలను ముండనం చేసుకున్న ఫొటో కూడా. ఇవన్నీ క్యాన్సర్‌ను అన్ని జబ్బుల్లాగే చూడటానికి స్ఫూర్తినిస్తున్నాయి.
ఇక మనిషా కోయిరాలా 2012లో ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడటం పెద్ద సంచలనం అయ్యింది. అభిమానులు తీవ్ర నిరాశలో పడ్డారు. ఆమె కూడా ఇది తనకు అశనిపాతంగా భావించింది. అయినప్పటికీ క్యాన్సర్ మీద పోరాడి గెలవాలని నిశ్చయించుకుందామె. న్యూయార్క్‌లో ఉండి వైద్యం తీసుకుంది. సుదీర్ఘకాలం వైద్యం కొనసాగినా బెదరక, చెదరక క్యాన్సర్‌ను జయించింది. తిరిగి సినిమాల్లో నటిస్తూ ఉంది కూడా.
వీరి కంటే ముందు కెరీర్ పీక్‌లో ఉండగా మోడల్ లీసారే క్యాన్సర్ బారిన పడింది. శిరోజ ముండనంతో ఆమె ఫొటోలు చూసి అభిమానులు తల్లడిల్లారు. కాని ఆమె క్యాన్సర్‌తో బహిరంగంగా పోరాడింది. తన పోరాటాన్ని ఎప్పటికప్పుడు లోకంతో పంచుకుంది. అంతే కాదు ఆ పోరాట సారాన్ని ‘క్లోజ్ టు ది బోన్: ఏ మెమొయిర్’ పేరుతో పుస్తకంగా రాసింది.
ఒకప్పటి స్టార్ నటి, ‘ఆప్ కీ కసమ్’, ‘ఆయినా’ సినిమాల హీరోయిన్ ముంతాజ్ తన 54వ ఏట 2000 సంవత్సరంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. ‘చావు కూడా నన్ను సులువుగా ఓడించలేదు. క్యాన్సర్ ఎంత’ అనే స్ఫూర్తితో పోరాడి గెలిచింది. ఇప్పుడు ఆమె వయసు 74. హాయిగా ఉంది. అలాగే మన తెలుగు నటి హంసా నందిని కూడా ఇప్పుడు క్యాన్సర్‌పై గట్టి పోరాటం చేస్తూ ఉంది.
క్యాన్సర్‌పై పోరాడండి. గెలవండి. పోరాడితే పోయేదేమి లేదు క్యాన్సర్ తప్ప.
Comments
Please login to add a commentAdd a comment